ఊళ్లో అంత క్రైమ్ జరిగితే పోలీసులేరీ?… ట్రోలర్స్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ‘ఇరుముడి’ డైరెక్టర్
రవితేజ హీరోగా థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక విమర్శలను ఎదుర్కొంటోంది. గ్రామంలో అంత పెద్ద క్రైమ్ జరిగినా కనీసం ఒక్క పోలీస్ కూడా రాకపోవడంపై నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. సినిమాలో పోలీస్ ఎంక్వైరీలు, పోస్టుమార్టంలు చూపిస్తే ప్రేక్షకుల మైండ్‌సెట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వైపు మళ్లుతుందని, పాత్రల అసలైన భావోద్వేగాలు పక్కదారి పడతాయనే ఉద్దేశంతోనే పోలీస్ లేయర్‌ను డెలిబరేట్‌గా తప్పించామని క్లారిటీ ఇచ్చారు. 2 గంటల 20 నిమిషాల వ్యవధిలో ఎమోషన్ దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు..
ఇంత జరుగుతుంటే పోలీసులు ఎక్కడ?
ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం.. కథలోని క్రైమ్ ఎపిసోడ్. గ్రామంలో అమ్మాయిలపై తీవ్రమైన వేధింపులు, వరుస మరణాల వంటి సీరియస్ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పుడు కనీసం ఒక్క పోలీస్ కూడా ఎక్కడా కనిపించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద నేరం జరిగినా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, పోలీస్ ఎంక్వైరీ లేకపోవడం సినిమాటిక్ లిబర్టీకి పరాకాష్ట అని మండిపడుతున్నారు. కథలో ఎమోషన్ పండించాలంటే రైటర్లకు కేవలం మహిళలపై అఘాయిత్యాలే కనిపిస్తాయా అంటూ సెటైర్లు వేస్తున్నారు…
శివ నిర్వాణ వివరణ
ఈ లాజిక్ లెస్ విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ… ఈ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ను ఉద్దేశపూర్వకంగానే ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరించారు. ‘ఈ ప్రశ్న కచ్చితంగా వస్తుందని నాకు ముందే తెలుసు. సినిమాలో సాయికుమార్ గారు మాట్లాడే సన్నివేశంలోనే ‘పోలీస్ స్టేషన్‌కు వెళ్తే విషయం మరింత మందికి తెలుస్తుంది’ అనే డైలాగ్ ద్వారా సమాజంలో ఉండే వాస్తవిక భయాన్ని చూపించాం. సినిమాలో బాలికల ఆత్మహత్యలు జరిగినప్పుడు వెంటనే పోలీసులు రావడం, పంచనామాలు, పోస్టుమార్టంలు అని చూపిస్తే ప్రేక్షకుల మైండ్‌సెట్ వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వైపు వెళ్లిపోతుంది” అని దర్శకుడు పేర్కొన్నారు.
కొంతకాలంగా సరైన హిట్ లేక ఢీలా పడిపోయిన మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ ఇరుముడి ’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అయ్యప్ప స్వామి భక్తి సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధాన బలంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. క్లాస్ మాస్, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. అయితే థియేటర్ల రన్ ముగిసిన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రానికి సరికొత్త సమస్య వచ్చిపడింది. ప్రతి ఫ్రేమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించే డిజిటల్ ఆడియన్స్ నుంచి సినిమాలో లాజిక్స్ లేవంటూ తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి.