అక్కా చెల్లెలు (జానపద కథ)..!

     ఒకూర్లో ఒక రైతు వుండేటోడు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెండ్లి చేసినాడు. పెద్దపిల్ల మొగుడేమో పెద్ద షావుకారు. చిన్నపిల్ల మొగుడేమో చిన్నరైతు. కొంతకాలానికి పెద్దపిల్లకు పదిమంది పిల్లలు పుట్టినారు. చిన్నపిల్లకేమో ఇద్దరు పుట్టినారు.
చిన్నపిల్ల ఆ ఇద్దరినే సాకలేక, వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టలేక నానా అవస్థలు పడేది. ఆ యింట్లో, ఈ యింట్లో పనులు చేసి సంపాదిస్తా వుండేది. పెద్దపిల్లకు బాగా డబ్బుంది గదా. అందుకని దానికి చానా పొగరెక్కువ. చెల్లెల్ని చూడ్డానికి అస్సలు వచ్చేది గాదు. ఎప్పుడన్నా యాడన్నా దారిలో కనబడినా అస్సలు పలకరించేది కాదు.
కొంతకాలానికి పిల్లలు పెద్దగైనారు. పెద్దపిల్ల తన కొడుక్కి ఒక పెద్దింటి సంబంధం చూసింది. పెండ్లికి ఊరిలో అందర్నీ పిలిచింది గానీ చెల్లెల్ని మాత్రం పిలవలేదు. ఊర్లో అందరూ పెండ్లికి పోతావుంటే చిన్నపిల్ల వాళ్ళను “యాడికి పోతా వున్నారు” అనడిగింది. దానికి వాళ్ళు “అదిగూడా తెలీదా. మీ అక్క కొడుకు పెండ్లి. చానా గొప్పగా జరుగుతా వుంది. మేమంతా ఆడికే పోతా వున్నాం” అన్నారు.
అక్క పిలవకపోయినా చెల్లెలికి గూడా పెండ్లికి పోవాలనిపించింది. పిల్లల్ని పిల్చి “రేయ్… నేను మా అక్క కొడుకు పెండ్లికి పోతావున్నా వచ్చేటప్పుడు మాంచి మాంచి పిండి వంటలు తెస్తాలే” అని చెప్పి… వున్న చీరల్లో మంచిది, బాగా ఉతికినేది కట్టుకోని పెండ్లికి పోయింది.
పెండ్లిలో అక్క వచ్చినోళ్ళందర్నీ పలకరిస్తా వుంది గానీ చెల్లెల్ని మాత్రం పలకరియ్యలేదు. చూసీ చూడనట్టుగా వుంది. చెల్లెలు బాధపడి అక్క దగ్గరకు పోయి “ఏందక్కా… నేనొచ్చి ఎంతసేపైంది. అందర్నీ పలకరిస్తా వున్నావు గానీ… సొంత చెల్లెల్ని నన్ను పలకరియ్యడం లేదు” అనింది.
దానికా పెద్దపిల్ల కోపంగా “అసలు నిన్నెవరు పిల్చినారే పెండ్లికి! నువ్వు నా చెల్లెలివని చెబితే అందరూ కిందామీదా పడి నవ్వుతారు. మా పనిమనుషులు కూడా నీకంటే బాగుంటారు. సరే ఎట్లాగూ వచ్చినావు గదా… అంట్లు తోమే మనిషి రాలేదు. పో… పోయి… ఆ పళ్ళాలన్నీ తోముపో” అనింది. చెల్లెలు కళ్ళ నిండా నీళ్ళు బెట్టుకోని అందరూ తిని పారేసిన ఎంగిలి పళ్ళాలన్నీ నున్నగా కడగసాగింది. పెండ్లికొచ్చినోళ్ళందరూ తినిపోయినారు గానీ… అక్క చెల్లెల్ని అన్నానికి కూడా పిలవలేదు. చిన్నపిల్ల అన్నీ నున్నగా తోమి మిగిలిపోయిన అన్నం, కూరలు పిల్లల కోసం మూటగట్టుకోని ఇంటికి బైలుదేరింది.
అంతలో అక్కొచ్చి ఏందే మూటగట్టుకోని పోతా వున్నావు అంటూ మూట విప్పి చూసి “ఇదంతా నీకెందుకే మా బరగొడ్లకు పనికొస్తాది” అంటూ అంతా తీస్కోని పోయి బరగొడ్ల ముందు గాట్లో పాడేసింది. పాపం… చిన్నపిల్లకు చానా బాధేసింది. ఏమీ మాట్లాడకుండా కళ్ళనీళ్ళు బెట్టుకోని గమ్మున ఇంటికి బైలుదేరింది. దారిలో వస్తా వుంటే ఒక పెద్దగుడి కనబడింది. లోపలున్న దేవతకు మొక్కుకోని కిందా మీదా పడి ఏడ్చింది. అది చూసి దేవత “పాపం ఈమెకు ఎంత కష్టమొచ్చిందో… ఏమో ఇట్లా బాధపడతా వుంది” అనుకోనింది. చిన్నపిల్ల గుడిబైట ఒక చచ్చిన పాము పడింటే దాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకోని ఇంటికి తీస్కోని పోయింది. అది చూసి దేవత గూడా ఆమెంబడే బైలుదేరింది.
ఆమె ఇంటికి పోగానే పిల్లలందరూ చుట్టూ మూగి “అమా… అమా… మీ అక్క మా కోసం ఏం పంపిచ్చిందే” అనడిగినారు. దానికామె కండ్లనీళ్ళు లోన దాచి పెట్టుకోని నవ్వుతా “రేయ్… మీ కోసం మా అక్క మంచి మంచి చాప ముక్కలు ఇచ్చింది. కొంచమాగండి తిందురుగానీ” అంటూ పాము ముక్కలు గిన్నెలో ఏసి కూర చేసింది.
దేవత ఆమెంబడే ఇంటికొచ్చింది గదా… ఇదంతా పైనుంచి చూసింది. ఆమెకు చానా జాలేసింది. వెంటనే గిన్నెలోని పాము ముక్కలన్నీ వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలుగా మార్చేసింది. చిన్నపిల్లకు అదంతా తెలీదు గదా. ఆమె పిల్లలందర్నీ వరుసగా కూచోబెట్టి కళ్ళనీళ్ళు వత్తుకుంటా గిన్నెలో నుండి గంటెతో కూర అందరి పళ్ళాల్లోనూ వేసింది. చూస్తే ఇంగేముంది. పాము ముక్కలు లేవు. ధగధగా మెరుస్తా వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పడినాయి. అందరూ ఆచ్చర్యపోయినారు.
చిన్నపిల్ల ఆనందంతో అవన్నీ అమ్ముకోని ఏడంతస్తుల మేడ కట్టుకోని, పదిమంది దాసీలను పెట్టుకోని హాయిగా వుండసాగింది. ఒకరోజు ఆమె కొడుక్కి పెండ్లి చేయాలని బంగారు పట్టుచీర కట్టుకోని ఊర్లో అందర్నీ పిలుస్తా అక్కను గూడా పిల్చింది. ఆమె కట్టుకున్న చీర చూసి దీనికి ఇంత డబ్బైక్కన్నించి వచ్చిందబ్బా అని పెద్దపిల్ల ఆచ్చర్యపోయింది.
పెండ్లికి పోయింది. ఏడంతస్తుల భవనం, దాసదాసీలు అన్నీ చూసి ఆచ్చర్యపోయింది. అక్కను చూస్తానే చెల్లెలు ఉరుక్కుంటా వచ్చి అక్కను ఇంట్లోకి పిల్చుకోనొచ్చింది. బంగారు తూగుటుయ్యాల మీద కూచోబెట్టి ఊపుతా ప్రేమగా తినుబండారాలన్నీ పెట్టింది. అవి తింటూ అక్క “ఇదంతా నీకెలా వచ్చిందే” అనడిగింది. చెల్లెలు జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించింది. .
అట్లాగా అని పెద్ద పిల్ల అడవికి పోయింది. ఆడ గుడి కనబడింది. దేవతకు మొక్కుకోని యాడైనా చచ్చిన పాము కనబడుతుందేమోనని వెదికింది. యాడా కనబల్లేదు. ఆఖరికి ఒక పెద్దపుట్టలో ఒక నాగుపాము కనబడింది. కట్టె తీస్కోనొచ్చి దాన్ని చంపి ముక్కలు ముక్కలు కోసుకోని ఇంటికి తీస్కోని పోయింది. దాన్ని బాగా కూరొండి తినింది. అంతే… విషమెక్కి అక్కడి కక్కడే కాలూ చేయీ చచ్చు పడి పోయినాయి.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************