జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక,కీలకమైన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎటువైపు..!

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. ఆదివారం ప్రచారానికి తెరపడటంతో ప్రధాన పార్టీలు గెలుపోటములు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కీలకమైన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎటువైపు అనేది ఆసక్తికంరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో కూటమిగా అన్నికార్యక్రమాల్లో ముందుకెళ్తున్నాయి.

తెలంగాణ మాత్రం ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. జనసేన మాత్రం బీజేపీతో కలిపి నడుస్తోంది. పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వస్తారనుకున్నా అది జరగలేదు. ఇటీవల ఎన్నికల ప్రచారం స్థానిక జనసేన నేతలు బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు.

ఎదుగుదల అక్కడ నుంచే ప్రారంభం :
కాంగ్రెస్ నుంచి ఉన్న నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ మూలాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపీనాథ్ ఎదుగుదల టీడీపీ నుంచే ప్రారంభమయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి టీడీపీతో 2 దశాబ్దాల అనుబంధ ఉంది. మాగంటి టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో బీఆర్ఎస్లో చేరారు.

ఎర్రగడ్డ, వెంగళ్రావునగర్, శ్రీనగర్‌కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు, సానుభూతిపరులకు కొదవలేదు. ఇప్పటివరకు వారంతా గోపినాథ్ వెంట నిలిచారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం వారి మద్దతు తమకే అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి టీడీపీతో అనుబంధం, ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఉన్నందున తమకే మద్దతు వస్తుందని బీజేపీ సైతం లెక్కలు వేసుకుంటోంది..

బిఆర్ఎస్ కే కొంత టీడీపీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం..

Brs పార్టీ మాగంటి గోపినాథ్, టిడిపి నాయకులతో మంచి సంబంధాలతోపాటు కుల సమీకరణలు కూడా చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు… టిడిపిలో ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గం ఉండడం, రియల్ ఎస్టేట్‌లో కూడా ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గమే ఉండటం హైడ్రా పేరుతో ప్రస్తుతం హైదరాబాదులో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్యలో కూడా వారే ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం… కుల సమీకరణ చూసుకుంటే కమ్మ సామాజిక ఓటు పరంగా బిఆర్ ఎస్ కే లాభం జరగొచ్చు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది..

ఉప ఎన్నికకు రంగం సిద్ధం : మరోవైపు ఆదివారం ప్రచారం ముగిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దానిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్నారు. ఈ సారి పోలింగ్ 50 శాతం దాటించాలని ఓటర్లకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించినట్లు స్పష్టం చేశారు.

తప్పుడు వార్తల ప్రచారలపై ప్రత్యేక బృందాలు : సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. సోషల్ మీడియాల్లో పోలింగ్ సరళితో పాటు ఓటు హక్కు వినియోగంపై తప్పుడు వార్తల ప్రచారం, వీడియోలు వైరల్ చేయడాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి 2 గంటలకోసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు కర్ణన్ తెలిపారు. పోలింగ్ సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు..