కర్ణాటకలో మహిళా ఎస్ఐపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె చేయిచేసుకున్న ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకా ఆరతి ఉక్కాడ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
తుమకూరు రూరల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య.. భీమన అమావాస్య సందర్భంగా ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె వీఐపీ దర్శన మార్గంలో వెళ్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. సవితతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
అక్కడే ఉన్న సీఐ లక్ష్మీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఐశ్వర్య.. ఎస్ఐ సవిత చెంపపై కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై ఎస్ఐ సవిత క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు BNSలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మరోవైపు.. అర్ధరాత్రి సమయంలో ఐశ్వర్య కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ సవితపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం..
ఈ ఘటనపై ఎమ్మెల్యే బీఎస్ సురేశ్ గౌడ స్పందిస్తూ.. తన కుమార్తెను పోలీసు అధికారిణి దూషించారని , ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు తన కుమార్తె అనుమతి కోరిందని, పోలీసులు ఆమెను అనుమతించలేదని తెలిపారు. ఈ సమయంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవటంతో దురదృష్టకర ఘటన జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
తొలుత తన కుమార్తెను పోలీసు అధికారి దూషించినట్లు తెలిసిందని, ఆ తరువాతే గొడవ జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఎస్ఐను చెంపదెబ్బ కొట్టిన వీడియోను తాను చకూడలేదని, నిజంగా అలా జరిగి ఉంటే తాను మహిళా ఎస్ఐకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఐశ్వర్య భర్త కేసీ గౌతమ్ పోలీస్ శాఖలో డీవైఎస్పీగా సేవలు అందిస్తుండటం విశేషం.
దీంతో ఇరువర్గాల ఫిర్యాదులతో ఈ ఘటన కర్ణాటకలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.