అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ను.
కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఇచ్చాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశాం. కానీ, కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయకపోగా.. రైతులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తానే స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేటీఆర్, హరీశ్ సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. వచ్చే నెలలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 25 ఏళ్ల వేడుకలు, వరంగల్లో భారీ బహిరంగ సభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు.. ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎ్సకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని, ఆ తర్వాత బీసీల పక్షాన పోరాడదామని పార్టీ నేతలతో అన్నారు. బీఆర్ఎ్సపార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం గర్వపడేలా రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్లో ఏప్రిల్ 27న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని పేర్కొన్నారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని చెప్పారు. అందుకోసం త్వరలో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు..