* _చిక్కితే వారికీ పాతికేళ్లు వచ్చే వరకు లైసెన్స్‌పై నిషేధం..నేటి నుంచి మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు_
_*హైదరాబాద్: పిల్లలు మారాం చేశారని..కాస్త దూరమనే ఉద్దేశంతో వాహనం వారి చేతికిచ్చారా..! ఇక నుంచి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. తెలిసీతెలియని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో నగర ట్రాఫిక్ పోలీసులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు.*_
_*శనివారం నుంచి నగరవ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ వెల్లడించారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే వాహన యజమానిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తారు. న్యాయస్థానంలో జరిమానా/జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది. సదరు వాహన రిజిస్ట్రేషన్(ఆర్సీ)ను కూడా 12 నెలలపాటు సస్పెండ్ చేస్తారు. సరరు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతా ఉండదు. ఈ నిబంధనల నేపథ్యంలో.. పిల్లలకు వాహనం ఇచ్చేముందు తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీలకు సహకరించాలని సంయుక్త సీపీ కోరారు. కాగా ఈ ఏడాది 3 నెలల వ్యవధిలో మైనర్ల డ్రైవింగ్‌తో 7 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మూడు ఘటనల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 4 కేసుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.*_
* _మైనర్లకు వాహనమిస్తే..!_
_*వాహన యజమానికి 12 నెలల పాటు వాహన ఆర్సీ రద్దుచేస్తారు. 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, 25వేల జరిమానా విధించే అవకాశముంది. బండి నడుపుతూ చిక్కిన మైనర్లు కూడా 25 ఏళ్లు వచ్చే వరకూ డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు.*_
*_మైనర్ డ్రైవింగ్‌పై కేసులు ఇలా_*
_జనవరి: 259_
_ఫిబ్రవరి: 219_
_మార్చి: 194_
*మొత్తం: 672*
_*ప్రాణాల మీదికి తేవొద్దు*_
* _డి.జోయల్ డేవిస్, నగర ట్రాఫిక్ సంయుక్త సీపీ_
_*మైనర్లు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. వాహనం ఇచ్చిన యజమాని, తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని గమనించాలి. చిన్నవయసులో అతివేగంగా వాహనం నడపడాన్ని సరదాగా భావిస్తారు. తెలియని వయసులో వారు వాహనం నియంత్రించలేరు. చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేయలేరు. పట్టు కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యను అధిగమించేందుకు తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యం. బిడ్డలు ఇష్టపడుతున్నారని, ఇతర కారణాలతో డ్రైవింగ్ లైసెన్స్ రాకముందే వాహనం చేతికి ఇవ్వొద్దు.*_