ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత ‘దేశద్రోహి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం..। కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత ‘దేశద్రోహి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన మానసిక స్థితిని, అసహనాన్ని తెలియజేస్తోందన్నారు. ఒక పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. అదేరోజు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే, రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించారని తెలిపారు. ఇదే అసలైన ‘ఓట్ చోరీ’ అంటే అని పేర్కొ్న్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించినప్పుడల్లా ఏం చేయాలో పాలుపోక రాజ్యాంగబద్ధ సంస్థలపై అసహనాన్ని వెల్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.’నిన్న సుప్రీంకోర్టు.. ఇవాళ ఎన్నికల కమిషన్.. రేపు మరో సంస్థ.. ఇలా కాంగ్రెస్ ప్రతి సంస్థపై తన అక్కసు వెల్లగక్కుతూనే ఉంటుంది. నిజంగానే విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తే.. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఎందుకు తిరుగుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్.. సుప్రీం కోర్టును నమ్మదు.. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం ఉంచదు.. ఈవీఎంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటుంది. చివరకు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సాయుధ బలగాలను కూడా విశ్వసించదు. రాహుల్ గాంధీ ఎవరిని నమ్ముతారు? ఎస్ఐఆర్ నిర్వహించిన చోట ‘ఓట్ చోరీ’ ద్వారా బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. తమిళనాడు, కేరళలో కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అక్కడ బీజేపీ గెలవలేదు కదా. పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన 20 నియోజకవర్గాల్లో టీఎంసీ 13 స్థానాల్లో గెలిచింది. ఎస్ఐఆర్ బెంగాల్లో కుట్ర అయితే.. కేరళలో ఎందుకు మీకు వరంగా కనిపిస్తోంది? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మోసం చేసే గెలిచాయని అనుకుంటున్నారా? కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు.. వేరే పార్టీలు గెలిస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతమా?’ అని కిషన్ రెడ్డి నిలదీశారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను ఎం.ఎస్ గిల్, టీ.ఎన్ శేషన్‌ను ఎంపీలు, కేంద్రమంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.