గోదావరి జిల్లాలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యం: పవన్ కల్యాణ్.

తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 56 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయమని, ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వంలో లేకపోయినా కౌలురైతులకు సాయం చేస్తున్నామన్నారు. ఇప్పటికే కౌలురైతుల కుటుంబాలకు రూ.కోట్లు సాయం చేశామని తెలిపారు. జేబులో డబ్బులు తీసి ఇవ్వడం తమకేమీ సరదా కాదని పేర్కొన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు జగన్‌ ఇష్టపడటం లేదన్నారు. నెరవేర్చలేని హామీలను ఎందుకు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి కనీసం రూ.7లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని వివరించారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెడితే మొదట స్వాగతించింది తామేనని గుర్తు చేశారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేస్తామని వివరించారు. ”నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. ఎన్నికల్లో యువత ఎవరి పక్షం ఉంటారో నిర్ణయించుకోవాలి. ప్రజలు కులాల స్థాయిని దాటి ఆలోచించాలి. ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఏలుతుంది. ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేసే బాధ్యత యువత తీసుకోవాలి. వైకాపాలోనూ కొందరు మంచి వారు ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి వారు చెప్పాలి. మా పార్టీ అభ్యర్థులను చూడవద్దు.. నన్ను చూడండి. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుంది. మార్పు కోసమే జనసేన పార్టీ వచ్చింది” అని పవన్‌ కల్యాణ్ వివరించారు :-