మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారని చెప్పిన కొండా సురేఖ. ఆ మంత్రుల పేర్లు చెప్పండి!.. కేటీఆర్…
మంత్రి కొండ సురేఖ మరొక కొత్త వివాదంలో పడ్డారు .తాజాగా ఆమె మంత్రుల పనితీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్ రెడ్డి షాక్ అయ్యేలా చేశారు… మంత్రులు డబ్బులు తీసుకోని ఫైల్స్ పై సంతకం చేస్తారన్న ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకి చాలా అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోంది. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన ఓ బహిరంగ రహస్యంగా మారింది. ఈ 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు, వారి సహచర మంత్రుల ప్రకారమే, భారీ కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టరని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపలే ధర్నా చేయడం ద్వారా ఈ ప్రభుత్వం కమిషన్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇలాంటి మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని నేను కొండా సురేఖని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేదా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీరు నియమించిన సొంత మంత్రి చేసిన ఆరోపణలపై దర్యాప్తు విచారణకు ఆదేశించగలరా?’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని, ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు….
వరంగల్ లో ఒక కార్యక్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలు.
వరంగల్ లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఐదు కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించ తలపెట్టిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయని, అటవీ శాఖ మంత్రిని కావడంతో తన అనుమతుల కోసం ఎన్నో ఫైల్స్ వస్తాయని కొండా సురేఖ పేర్కొన్నారు.
మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారని చెప్పిన కొండా సురేఖ
మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు కానీ తాను అలా చేయనని, సమాజసేవ చేయమని పేర్కొన్నారు. తనకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పానని, ఒక కంపెనీ వాళ్ళను స్కూల్ డెవలప్మెంట్ చేయమని చెప్పి కోరానని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు రాజకీయ వర్గాలను చర్చకు కారణమవుతున్నాయి.