బాడీ షేమింగ్ నుంచి దేశానికి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ స్ఫూర్తిదాయక ప్రస్థానం!
ఒకప్పుడు “లావుగా ఉన్నావ్” అంటూ విమర్శలు, అవహేళనలు ఎదుర్కొన్న చెన్నై అథ్లెట్ కృష్ణ జయశంకర్ ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ 2026లో షాట్‌పుట్ విభాగంలో 17.35 మీటర్లు విసిరి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు…
రక్తంలోనే క్రీడలు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో క్రీడలు ఒక పండుగలా ఉండేవి. నా తండ్రి సి.జయశంకర్ మీనన్ భారత పురుషుల బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్. నా తల్లి ప్రసన్న మహిళా జట్టుకు కెప్టెన్. ఆ తర్వాత కోచ్‌గా, జాతీయ సెలక్టర్‌గానూ సేవలు అందించారు. బాస్కెట్‌బాల్ మా తల్లిదండ్రుల ప్రపంచం. దీంతో నాకంటూ సొంత గుర్తింపు కావాలనిపించి షాట్‌పుట్, డిస్కస్ త్రోలను ఎంచుకున్నాను. మూడునాలుగేళ్ల వయసున్నప్పుడు అరచేతికి తీవ్ర గాయమై రక్తం కారుతున్నా ఏడవకుండా నవ్వుతూనే ఉన్నానట. ఆ మొండితనమే నా కెరీర్‌కు పునాది అయింది..
గాయపరిచిన బాడీషేమింగ్
ఒకవైపు ఆటలో గెలుస్తున్నా.. సమాజం నుంచి వచ్చే బాడీ షేమింగ్ నన్ను ఎంతో గాయపరిచింది. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలకు భిన్నంగా పొడవుగా, వెడల్పాటి భుజాలతో ఉండే నా శరీరాన్ని చూసి ఎగతాళి చేసేవారు. అమ్మాయి అంటే ఇలా ఉండకూడదన్నట్టు చూసేవారు. కానీ నేను జమైకా, అమెరికా వెళ్లినప్పుడు నా ఆలోచనలు మారాయి. అక్కడ శారీరక బలాన్ని గర్వంగా చాటుకునే మహిళా అథ్లెట్లను చూశాను. బలం అనేది లోపం కాదు.. అది ఒక అద్భుతమైన ఆస్తి అని అప్పుడు నాకు అర్థమైంది…
అయిన ఆగని ప్రయాణం…
ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, లాస్ఏంజెలెస్ 2028 ఒలింపిక్స్ ఉన్నాయి. నేను పోడియంపై నిలబడి ఉన్నప్పుడు మన త్రివర్ణ పతాకం ఎగురుతుంటే భారత జాతీయ గీతం వినిపించాలనేదే నా జీవిత కల. మా నాన్న ఆ అనుభూతిని పొందారు. ఇప్పుడు నేను దాని కోసం ఎదురుచూస్తున్నాను. నన్ను నేను మూడు ముక్కల్లో వర్ణించుకోవాలంటే.. భయం లేనిదాన్ని. తిరుగుబాటుదారురాల్ని, పోరాట యోధురాల్ని. నా ప్రయాణం ద్వారా వచ్చే తరానికి నేను చెప్పేది ఒక్కటే. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు
తగ్గించుకోవద్దు. స్పేస్ తీసుకోండి. పెద్ద కలలు కనండి. ఓటములు, తిరస్కరణల తర్వాత కూడా ఆగడానికి నిరాకరించే మొండితనమే మిమ్మల్ని చరిత్ర శిఖరాలపై నిలబెడుతుంది..
ఇండోర్ షాట్‌పుట్‌లో 16 మీటర్ల మార్క్ దాటిన తొలి భారతీయ మహిళ.
NCAA డివిజన్-1 స్కాలర్షిప్ పొందిన తొలి భారతీయ మహిళా త్రోయర్.
18 ఏళ్ల వయసులోనే జమైకా వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన క్రీడాకారిణి.
సమాజం విధించిన అందాల ప్రమాణాలకు తలొగ్గకుండా.. తన శక్తిని, పట్టుదలను విజయంగా మలచుకున్న కృష్ణ జయశంకర్ ఇప్పుడు LA 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
విమర్శలను ఆయుధంగా మార్చుకుని విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ కృష్ణ జయశంకర్ ఓ స్ఫూర్తి.