కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలి… కేటీఆర్‌.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎల్బీనగర్‌లో నిర్వహించిన ‘నా బూత్‌- నా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ పోక్సో కేసులో అరెస్టైన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయిందని ఆరోపించారు..కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కలిసి బాధితురాలికి అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్‌ విమర్శించారు. కానీ ఆ బాలికకు న్యాయం జరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే పోరాడిందని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. దేశ చరిత్రలో బహుశా మొదటిసారి ఓ కేంద్రమంత్రి కుమారుడిపై లుకౌట్‌ సర్క్యులర్‌ ఇచ్చే పరిస్థితి వచ్చిందని కేటీఆర్‌ అన్నారు.

బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఈ కేసులో విచారణ సరిగా జరగదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. తప్పు చేసిన వ్యక్తిని దాదాపు తొమ్మిది రోజులపాటు దాచిపెట్టింది కేంద్రమంత్రేనని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసి కేసును నీరుగార్చాలని చూశారన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం తెలంగాణ రాష్ట్రానికేగాక దేశానికే అవమానమని మండిపడ్డారు.