స్థానిక సంస్థ‌ల ఓట‌ర్ల జాబితా పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులతో ఇవాళ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేటీఆర్, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీఆర్ఎస్ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు తమ అభ్యంతరాలను చెప్పుకోవడానికి తక్కువ గడువు విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు కేటీఆర్.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఎన్నికల సంఘం మంగ‌ళ‌వారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

అయితే ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది..