ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా రేవంత్ రెడ్డి జిల్లాల రద్దు కుట్ర..!
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు.
ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల పార్టీ నేతలతో సమావేశం..
*పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు*
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
జిల్లాల పునర్విభజన పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు పేరిట రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈరోజు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ప్రభుత్వం యొక్క సేవలు, అభివృద్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ అనే దృక్పథంతో పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దీంతోపాటు పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ఈ రెండు అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించే విధంగా చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణతో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమిష్టిగా ముందుకు పోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ అయిన మహబూబ్నగర్ పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, మహబూబ్నగర్ పట్టణానికి మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు పోవాలన్నారు. దీంతోపాటు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టాలని సూచించారు.
మరోవైపు నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఒకప్పుడు తీవ్రంగా వెనుకబడిన నల్లగొండ జిల్లాను ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు. దీంతోపాటు ఇద్దరు మంత్రులు ఉన్న నల్లగొండ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, 24 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నదో, ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా రద్దు చేస్తూ పోతున్నదో వివరించాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరును పట్టణ ప్రజలకు వివరించాలన్నారు. దీంతోపాటు అన్ని మున్సిపాలిటీలలో గతంలో టీయూఎఫ్ఐడీసీ మరియు పురపాలక శాఖ ద్వారా అనేక వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించాలన్నారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు.
ఈ సమావేశం సందర్భంగా ప్రతి పార్టీ నేత తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పరిస్థితులను, సంసిద్ధతను పార్టీ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు అనేక అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959