సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన అంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతున్నదని మండిపడ్డారు. అసమర్థ మూర్ఖ ఏలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అసంతృప్తులు కొనసాగుతున్నాయని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు..తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.
ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. ‘హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు..
అర్ధరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్..!
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. అర్ధరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?” అని కేటీఆర్ నిలదీశారు…రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం.. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా” అని కేటీఆర్ చెప్పారు. కాగా, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గత అర్ధరాత్రి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు..