అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు .!

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు ..

ఆయుర్వేదవైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యంలో మీకు గనుక సంపూర్ణమైన నమ్మకముంటే “అశ్వగంధ” మూలిక గురించి అనేకమార్లు వినే ఉంటారు. ఎందుకు విని ఉండరు? ఎందుకంటే అశ్వగంధ అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద మూలికలలో ఒకటి. వేల సంవత్సరాల క్రితమే అశ్వగంధ యొక్క ఉనికి మరియు దాన్ని ఉపయోగించిన సంగతి గురించి అథర్వ(ణ)వేదంలో ఉంటంకించబడింది. భారతీయ సంప్రదాయిక వైద్యవిధానం తరచుగా అశ్వగంధను “మాయామూలిక” గా, ఒత్తిడిని హరించే ఏజెంట్ గా (ఆంగ్లంలో “అడాప్టోజెన్” అంటారు.) సూచించింది. ఎందుకంటే ఇది ఒత్తిడి సంబంధిత లక్షణాలు మరియు ఆందోళనకర రుగ్మతలను తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించే మూలికల్లో ఒకటి. “అశ్వగంధ” అనే పేరుకు అర్థం – ‘అశ్వ’ అంటే గుర్రం, మరియు ‘గంధ’ అంటే వాసన అని. అదనంగా చెప్పాలంటే అశ్వగంధ వేర్లు గుర్రం యొక్క మూత్రం లేక చెమట వాసనను కల్గి ఉంటాయి కాబట్టి నేరుగా తర్జుమా రూపంలో ఈ మూలికకు “అశ్వగంధ” అనే పేరు స్థిరపడింది. అలాగే ఆయుర్వేద పరిశోధకులు చెప్పే మరో మిషయమేమిటంటే అశ్వగంధను సేవిస్తే గుర్రంకున్నంత లైంగిక శక్తి వస్తుందని.

అశ్వగంధ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: విటానియా సోమ్నిఫెరా
కుటుంబము: సోలనాసియే (nightshade family)
సంస్కృతం పేర్లు: అశ్వగంధ, వరాహకార్ణి (ఆకులు పంది చెవిని పోలి ఉంటాయి), కామరూపిని.
సాధారణ పేర్లు: వింటర్ చెర్రీ, ఇండియన్ జిన్సెంగ్, పాయిజన్ గూస్బెర్రీ.
ఉపయోగించే భాగాలు: అశ్వగంధ వేర్లు మరియు ఆకులు ఎక్కువగా మందుల్లో ఉపయోగిస్తారు. కానీ దీని పుష్పాలు మరియు విత్తనాలు కూడా ఉపయోగించబడుతున్నాయి.
స్థానికంగా లభ్యమయ్యే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారతదేశంలోని వేడి ప్రదేశాలు, అందులోను ప్రముఖంగా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు, నేపాల్, ఆఫ్రికా మరియు మధ్యతూర్పు (middle east) దేశాల్లో అశ్వగంధ ఉనికి, వాడకాలున్నాయి. ఇది అమెరికా (USA) లో కూడా ప్రవేశపెట్టబడింది..

స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం –

మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 7 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను .

మోతాదు –

5 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను .

అశ్వగంధ 7 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును .

ఔషధోపయోగాలు –

* శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు .

* నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును .

* క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును .

* విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును .

* స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును .

* రక్తము నందలి దోషములను పోగొట్టును .

* కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును .

* నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును .

* పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది .

* మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును .

* అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .

* బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును .

* శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును .

* కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును .

* గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును .

* గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను .

* కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు .

* వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను .

* స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును .

* మూర్చరోగులకు ఇది వరం వంటిది .

* స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును .

* స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును .

ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను .

తాంబూలం , మద్యము , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం .