కుర్చీ వేసి కూర్చున్న మంత్రిగారు రండి.. కేటీఆర్.

వెన్నుచూపి పారిపోవడం ముఖ్యమంత్రి, మంత్రులకు మొదటి నుంచీ అలవాటేనని.. అందుకే చర్చలకు రాకుండా సిగ్గులేకుండా తోకముడిచి పారిపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చించే దమ్ములేకనే డైవర్షన్‌ డ్రామాలు చేస్తున్నారని.. పారిపోతే వదిలిపెట్టబోమని ప్రతిపక్షంగా గట్టిగా నిలదీసి ప్రజాక్షేత్రంలో కడిగిపారేస్తామని కేటీఆర్ అన్నారు..
ధైర్యముంటే అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌ పెట్టు
సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యముంటే రెండేండ్ల పాలన, హామీల అమలుపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తమకు మైక్‌ కట్‌ చేయకుండా 2 గంటలు అవకాశమిస్తే కాంగ్రెస్‌ సర్కార్‌ అక్రమాలు, అరాచకాలు, బాగోతాలు, వైఫల్యాలను బట్టబయలు చేస్తామని స్పష్టంచేశారు.

అప్పులపై కాంగ్రెస్‌ కాకి లెక్కలు
బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో తెచ్చిన అప్పులు కేవలం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్‌ మరోమారు స్పష్టంచేశారు. ఇవి తాను చెబుతున్న లెక్కలు కావని కాగ్‌ తేల్చిన నిజానిజాలని తెలిపారు. అప్పులపై గతంలోనూ హరీశ్‌రావు అసెంబ్లీ సాక్షిగా నిగ్గుతేల్చినా కాంగ్రెస్‌ మంత్రులకు సోయి రాకపోవడం సిగ్గుచేటని దెప్పిపొడిచారు. కాగ్‌ లెక్కలను పక్కనబెట్టి రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క కాకిలెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే మరోసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పులపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ధైర్యముంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు..

అదానీని మించిన ‘అనుముల బ్రదర్స్‌’ ఆస్తులు
సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల అరాచకాలకు అంతులేకుండా పోయిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 30నెలల్లో రాష్ర్టాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలు అధోగతి పాలవుతుంటే అనుముల బ్రదర్స్‌ ఆస్తులు అదానీని మించిపోతున్నాయని ఆరోపించారు. అమాయకులను బెదిరించి భూములు గుంజుకుం టూ ఆస్తులు పొగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎైక్సెజ్‌ శాఖలో హోలోగ్రామ్‌ టెండర్ల వ్యవహారంలో మంత్రి జూపల్లి కొడుకు, సీఎం రేవంత్‌ అల్లుడి పంచాయితీ భరించలేక సిన్సియర్‌ ఐఏఎస్‌ అధికారి రిజ్వీ రాజీనామా చేశా రు. జూపల్లికి బీర్ల కోసం తెచ్చిన జీవోపై అవగాహన లేదంటూ చురకలంటించారు. కానీ సీఎం మెప్పు కోసమే సవాళ్ల పేరిట బూటకపు డ్రామాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.

రాహుల్‌ను రమ్మనండి..
రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్‌ రావాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ చేస్తున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘రేవంత్‌స్థాయికి కేసీఆర్‌ ఎందుకని? మేం సరిపోతాం..’ అని చెప్పారు. తమనే ఎదుర్కోవడం చేతగాని రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఎక్కడిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను రమ్మని అడుగుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే నాడు రాష్ట్రానికి వచ్చి అడ్డగోలు హామీలిచ్చిన రాహుల్‌గాంధీని తీసుకురావాలని కేటీఆర్‌ ప్రతిసవాల్‌ విసిరారు.