తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్..!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. ఇది రాష్ట్రంలో గ్రామీణ పాలనకు కీలకమైన అడుగుగా మారింది. గత రెండేళ్లుగా ఆలస్యం అవుతున్న ఈ ఎన్నికలు ఇప్పుడు వేగంగా జరిగేలా ఉన్నాయి.
ఎన్నికలను ఇప్పుడు ఆపలేము అని హైకోర్టు ఎందుకు చెప్పిందంటే.. ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. జీవో 46ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్‌ వాదనలు వినిపించారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. జీవోలో అలా లేదు కాబట్టి.. స్టే విధించాలని కోరారు. ఐతే.. ఇందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసేసింది కాబట్టి.. ఈ దశలో ఎన్నికల ప్రక్రియపై స్టే విధించలేని హైకోర్టు తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తన వాదనను కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశిస్తూ.. విచారణను 2 నెలల వరకూ వాయిదా వేసింది. ఐతే.. ఎన్నికలు డిసెంబర్ 17తో ముగుస్తాయి కాబట్టి.. ఎన్నికలకు సమస్యలు తొలగిపోయినట్లే.