బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపాను గా మారడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపు వంద రైలు సర్వీసులను రద్దు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తుపాను ప్రభావం వల్ల ఈస్ట్‌కోస్ట్ రైల్వే రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 54 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అక్టోబరు 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, రద్దు చేసిన రైళ్ల జాబితాను ‘ఎక్స్’లో పోస్టు చేసింది..
రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచన : ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. రద్దు అయిన రైళ్ల జాబితాలో నేడు (సోమవారం) విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్‌రథ్, దిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ – తిరుపతి డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు సూపర్‌ఫాస్ట్, మెము, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
28, 29 తేదీల్లో రద్దు : తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ పీఆర్వో ఓ ప్రకటనలో వెల్లడించారు. తుపాను కారణంగా ఈ నెల 28, 29 తేదీల్లో రద్దు చేసిన రైలు సర్వీసుల జాబితాను విడుదల చేశారు..