మణిపుర్ సరిహద్దు వివాదం.. భూభాగ మార్పిడిపై భారత్-మయన్మార్ చర్చలు…!

మణిపుర్ సరిహద్దు వివాదం.. భూభాగ మార్పిడిపై భారత్-మయన్మార్ చర్చలు
మణిపుర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-మయన్మార్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలు భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సరిహద్దులో ఇప్పటికీ గుర్తింపు పూర్తికాని ప్రాంతాల సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి Randhir Jaiswal మాట్లాడుతూ, సరిహద్దులో ఇంకా కొన్ని ప్రాంతాల గుర్తింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, వాటి పరిష్కారం కోసం మయన్మార్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇటీవల వెలువడిన కథనాల ప్రకారం, మణిపుర్‌లోని చందేల్ జిల్లా, మయన్మార్‌లోని కబావ్ లోయ ప్రాంతం మధ్య సుమారు 1.4 చదరపు మైళ్ల భూభాగ మార్పిడి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మార్పిడి ద్వారా సరిహద్దు స్తంభాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, మిగిలిన సరిహద్దుకు కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత్-మయన్మార్ మధ్య మొత్తం 1,643 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా, అందులో 1,472 కిలోమీటర్ల మేర సరిహద్దు గుర్తింపు పూర్తయింది. ఇంకా 171 కిలోమీటర్ల మేర సరిహద్దు నిర్ధారణ పెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.