భూపరిశోధన పరీక్షలో ఎన్‌జిఆర్‌ఐ భాగస్వామ్యం కావాలి..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాల్లో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఎన్‌జిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ సచివాలయంలో అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్‌జిఆర్‌ఐ సంస్థను అభినందించడంతో పాటు ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి ఎన్‌జిఆర్‌ఐ ఆధ్వర్యంలో భూపరిశోధన (సాయిలు టెస్ట్) భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈఎన్‌సి రమేష్ బాబు సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా, ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌జిఆర్‌ఐ రూపొందించిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఎన్‌జిఆర్‌ఐతో సమగ్రంగా సర్వే నిర్వహినట్లు ఆయన తెలిపారు…