రేపటి నుండి నేను రాను..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

ఈ రోజు సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చాను.. రేపటి నుండి నేను రాను

వరదల సమయంలో మనం ఉండాల్సింది అసెంబ్లీలో కాదు ప్రజల్లో

ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే నా లక్ష్యం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

వరద సమయంలో ప్రజలకి అందుబాటులో ఉండి అక్కడ సమస్యలు తెలుసుకోవాలి తప్ప.. అసెంబ్లీలో చర్చలు జరిగినంత మాత్రాన అక్కడ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం కావు అని అన్నారు… తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని , పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్టీ కూడా మాట నిలబెట్టుకోవాలని అన్నారు…

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని.. వారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వరద సమయంలో మనం ఉండాల్సింది ప్రజల్లో కానీ అసెంబ్లీలో కాదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పారు…కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన అనుచరులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్లే తాను అసెంబ్లీకి మళ్లీ రానని వివరించారు. ఇక మంత్రి పదవిపైనా రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా సరే పదవి శాశ్వతం కాదని అన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమని పేర్కొన్నారు. సేవాగుణం చచ్చేవరకూ ఉంటుందని.. కానీ పదవి మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా సహాయం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని అనుకుంటే సాధ్యం కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు.