నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం..!

ఛార్జింగ్‌లో పెట్టిన మొబైల్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన మాదారం నవీన్ కుమార్ తన మొబైల్ ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోయాడు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఫోన్‌ను తీసుకుని జేబులో పెట్టుకుని వ్యవసాయ పొలం వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో జేబులో ఉన్న మొబైల్ ఫోన్ విపరీతంగా వేడిగా అనిపించడంతో అప్రమత్తమైన నవీన్.. వెంటనే ఫోన్‌ను జేబులో నుంచి బయటకు తీశాడు.

అదే సమయంలో మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది. ఫోన్‌ను వెంటనే బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.

రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచిన మొబైల్‌ను ఉదయం జేబులో పెట్టుకుని తీసుకెళ్లిన సమయంలో వేడెక్కడం, అనంతరం పేలడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఫోన్ ను కింద పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి మొబైల్ పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఫోన్ ను జేబులో నుంచి బయటకు తీస్తున్న క్రమంలో పేలడంతో యువడకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు రాత్రంతా ఛార్జింజ్ లో ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కిందా… లేక బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగానే పేలిందా అన్నది పూర్తి వివరాలు తెలియరాలేదు..।