భారత్ పురోగతిని వేగవంతం చేసిన తీరును ప్రపంచం అభినందిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సంస్కరణలు వివిధ రంగాలకు చెందినవని, దేశ వృద్ధి సామర్థ్యాన్ని విస్తృతం చేస్తాయని అన్నారు. భారత్ తన ఆవిష్కరణల కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ను ప్రపంచం ఆశతో, విశ్వాసంతో చూస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు లింక్డిన్లో పోస్ట్ చేశారు..భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ను ఎక్కిందని మోదీ తెలిపారు. ఈ సంస్కరణల ఎక్స్ప్రెస్ ప్రాథమిక ఇంజిన్ దేశ జనాభా, యువత, ప్రజల అజేయ స్ఫూర్తి అని తాను చాలా మందికి చెబుతున్నానన్నారు. గత 11 ఏళ్లుగా నిరంతర జాతీయ లక్ష్యంతో సంస్కరణలపై దృష్టి సారించిన సంవత్సరంగా 2025 భారత్ కు గుర్తుండిపోతుందని చెప్పారు. తాము సంస్థలను ఆధునీకరించామని, పాలనను సరళీకృతం చేశామని గుర్తు చేసుకున్నారు. దీర్ఘకాలిక, సమ్మిళిత వృద్ధికి పునాదులను బలోపేతం చేశామని పేర్కొన్నారు..
నరేంద్ర మోదీ, భారత ప్రధాని..
ఒకే పార్లమెంట్ సమావేశంలో (వర్షాకాల సమావేశంలో) ఐదు మైలురాయి సముద్ర చట్టాలను ఆమోదించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. “బిల్స్ ఆఫ్ లాడింగ్ చట్టం- 2025, సముద్రమార్గం ద్వారా వస్తువుల రవాణా బిల్లు- 2025, కోస్టల్ షిప్పింగ్ బిల్లు- 2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు- 2025, ఇండియన్ పోర్ట్స్ బిల్లు- 2025 ను వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాం. ఈ సంస్కరణలు డాక్యుమెంటేషన్ను సులభతరం చేస్తాయి. వివాద పరిష్కారాన్ని సులభతరం చేస్తాయి. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తాయి. వందల ఏళ్ల క్రితం నాటి పాత చట్టాలను కూడా భర్తీ చేశాయి. 29 కార్మిక చట్టాలను నాలుగుకు కుదించాం. వాటి స్థానంలో నాలుగు ఆధునిక లేబర్ కోడ్ లను తెచ్చాం. తద్వారా చారిత్రక కార్మిక సంస్కరణలు ప్రారంభించాం. ఈ సంస్కరణలు న్యాయమైన వేతనాలు, జీతాలను సకాలంలో చెల్లించడం, ఉద్యోగుల సామాజిక భద్రత, సురక్షితమైన కార్యాలయాలపై దృష్టి సారించాయి. ఇవి శ్రామిక శక్తిలో ఎక్కువ మహిళా భాగస్వామ్యాన్ని నిర్ధరిస్తాయి. కాంట్రాక్ట్ కార్మికులు సహా అసంఘటిత కార్మికులను ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకొచ్చాం” అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, న్యూజిలాండ్, ఒమన్, బ్రిటన్లతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఈ ఒప్పందాలు పెట్టుబడులకు తోడ్పడతాయని అన్నారు. ఉద్యోగ సృష్టిని పెంచుతాయని, స్థానిక వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తాయని వెల్లడించారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959