భారత్ తో కయ్యానికి కాలు దువ్వాలనుకున్నారు.. చివరికి వారే కాలిపోతున్నారు..!

నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్.. నేడు నేపాల్..

భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన దేశాలకు వర్తిస్తుంది.

శ్రీలంకలో రాజపక్స కుటుంబం పతనం, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ రాజీనామా.. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల గొంతును అధికార బలంతో అణచివేయలేమని స్పష్టం చేస్తున్నాయి. ప్రజల గొంతుకను, వారి డిమాండ్లను, వారి హక్కులను ఎవరూ ఎక్కువ కాలం అణచివేయలేరని ఈ ప్రభుత్వాల పతనంతో తేలిపోయింది. నేపాల్‌లో కూడా అదే జరిగింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై నిషేధం విధించగానే.. ప్రజలు ఓలీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి పడగొట్టారు..

.భారత్‌ను దెబ్బతీయాలని, డ్యామేజ్‌ చేయాలని చూసిన ఏదేశమూ బాగుపడలేదు. భారత్‌ను విమర్శించిన దేశాలు ఒక్కొక్కటిగా రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయనే చర్చ ఇటీవల ఊపందుకుంది. మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, కెనడా, నేపాల్‌ వంటి దేశాలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. ట్రంప్‌ వ్యవహారశైలి కారణంగా అమెరికా కూడా భారత్‌తో ఘర్షణ పడుతోందని, రాబోయే రోజుల్లో అది సంక్షోభంలోకి జారుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణాసియాలో అస్థిరత..
దక్షిణాసియా దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్‌లు ఇటీవలి కాలంలో రాజకీయ, ఆర్థిక అస్థిరతలతో సతమతమవుతున్నాయి. ఈ దేశాలు భారత్‌తో సంబంధాలలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి, కొన్ని సందర్భాల్లో భారత్‌పై విమర్శలు గుప్పించాయి. ఈ సంక్షోభాల వెనుక ఆయా దేశాల అంతర్గత రాజకీయాలు, ఆర్థిక సమస్యలు, విదేశీ శక్తుల ప్రభావం కీలక పాత్ర పోషిస్తున్నాయి.

– మాల్దీవులు..
2023లో అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జూ ‘ఇండియా ఔట్‌’ నినాదంతో ఎన్నికల్లో గెలిచారు. భారత సైనిక ఉనికిని తొలగించాలని డిమాండ్‌ చేసిన ఆయన, చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. అయితే, 2024లో ఆర్థిక సంక్షోభం, పర్యాటక రంగంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు మాల్దీవులను కుదిపాయి. దీంతో ముయిజ్జూ భారత్‌తో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించారు, కానీ దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది.

– బంగ్లాదేశ్‌..
2024లో షేక్‌ హసీనా ప్రభుత్వం పతనం, విద్యార్థుల నిరసనలు బంగ్లాదేశ్‌ను రాజకీయ అనిశ్చితిలోకి నెట్టాయి. హసీనా భారత్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండగా, ఆమె పతనం తర్వాత బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ), ఇతర ఇస్లామిస్ట్‌ సమూహాలు చైనా, పాకిస్తాన్‌లతో సంబంధాలను బలపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మార్పు భారత్‌కు భద్రతా సవాళ్లను, మైనారిటీ హిందువులపై దాడుల ఆందోళనను తెచ్చిపెట్టింది…

నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్.. నేడు నేపాల్.. మరి రేపు?
పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే కష్టాలు ఒంటరిగా రావు, గుంపులు గుంపులుగా వస్తాయి అనే సామెత గుర్తుకు వస్తుంది. మొదట ద్రవ్యోల్బణం పాక్ ను దుర్భరం చేసింది. ఆ తరువాత రాజకీయాలు శాంతిని హరించాయి. వీటితో పాటు ఇటీవల వాతావరణం కూడా కరుణించలేదు. వరదల రూపంలో పాక్ ను కోలుకోలేకుండా చేసింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఒకనొక దశలో ద్రవ్యోల్బణం దాయాది దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ దేశంలో ప్రభుత్వం పాలనపై దృష్టిసారించకపోతే రాబోయే కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో లాగే పరిస్థితులు దాపురిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..