నేషనల్ హెరాల్డ్ కేసు..ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు..

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చింది. దీంతో ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25న రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించనుంది. కాగా ఇప్పటికే నేషనల్ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది…..

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అయితే అందులో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురి పేర్లను చేర్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సోనియా, రాహుల్‌ గాంధీలతోపాటు ఆ పార్టీకి చెందిన నేతలు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్‌ 25వ తేదీన ఢిల్లీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది..అయితే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై గతంలోనే ఆరోపణలు వచ్చినా.. ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న ఈ మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, బిజినెస్‌మెన్ రాబర్ట్ వాద్రాను ఈడీ అధికారులు ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం..ఈ నేషనల్ హెరాల్డ్‌ కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఇప్పటికే గతంలో ఈడీ అధికారులు.. సోనియా, రాహుల్‌లను పలుమార్లు విచారణ జరిపారు. విదేశాల నుంచి వచ్చిన నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నడిపించారనే ఫిర్యాదులతో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి. ఈ కేసు విచారణను సీబీఐ మధ్యలోనే వదిలేసినప్పటికీ.. ఈడీ మాత్రం దర్యాప్తు చేస్తోంది..