నేటి పంచాంగం.. నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 07 – 12 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *షష్ఠి* ఉ9.25 వరకు,
నక్షత్రం : *ధనిష్ఠ* మ3.50 వరకు,
యోగం : *వ్యాఘాతం* ఉ8.36 వరకు,
తదుపరి *హర్షణం* తె5.54 వరకు,
కరణం : *తైతుల* ఉ9.25 వరకు
తదుపరి *గరజి* రా8.32 వరకు,

వర్జ్యం : రా10.41 – 12.12,
దుర్ముహూర్తము : ఉ6.20 – 7.48,
అమృతకాలం : ఉ7.20 వరకు,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం : మ1.30 – 3.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.21,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి మాట_*

*శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి*
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో *”శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి”* వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును *”శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి”* గా పరిగణిస్తారు.

_ఒకసారి – ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము🙏 !_

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న *”తారకా సురుడు”* అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు.
దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు, ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు.
కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు.

మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు, అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.
ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది.
ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.

ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి *”సర్పరూపం”* దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును *”శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా* పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున *”శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి”* వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం.
అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.

ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన *”శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”* నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి, పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం.

సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.

*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏