ఓఎల్‌ఎక్స్‌లో ఇప్పుడు ఒక పోస్టు వైరల్‌గా మారింది. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేందుకు ఉపయోగించే ఈ ఓఎల్‌ఎక్స్‌లో ఒక వ్యక్తి ఒక భవనాన్ని అమ్మకానికి పెట్టాడు. బిల్డింగ్ అమ్మకానికి పెడితే అంత ట్రెండింగ్ ఎందుకు అవుతుందని అనుమానం వస్తుందా.. దానికి కారణం ఉంది.. అదేంటంటే.. అది సదరు వ్యక్తికి చెందిన ఇల్లు కాదు.. ప్రభుత్వ భవనం. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఎమ్మార్వో ఆఫీసు!.
ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి తహశీల్దార్ కార్యాలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆన్లైన్ కొనుగోలు–అమ్మకాల వేదిక ఓఎల్‌ఎక్స్‌లో‘గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం అమ్మకానికి’అంటూ ఒక ఆకతాయి పోస్ట్ చేశాడు. అంతేకాదు తహశీల్దార్ కార్యాలయం ధర రూ.20 వేలుగా అందులో పేర్కొన్నాడు. ప్రభుత్వ కార్యాలయం అందులోనూ మండల మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఓఎల్‌ఎక్స్‌ల అమ్మకానికి పెట్టడంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి తహశీల్దార్ కార్యాలయం అనే పోస్టుపై గిద్దలూరు తహశీల్దార్ స్పందించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా, అధికార వ్యవస్థను హాస్యాస్పదం చేసేలా చేసిన ఈ తప్పుడు పోస్ట్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేసింది ఎవరో అనేది తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. తహశీల్దార్ కార్యాలయం సేల్ అంటూ ఓఎల్‌ఎక్స్‌లో పెట్టడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? ఎందుకు ఇలా పెట్టి ఉంటారు? అయినా తహశీల్దార్ కార్యాలయాన్నే ఎందుకు టార్గెట్ చేశాడు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, చిహ్నాలను దుర్వినియోగం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనపై మరింత సమాచారం కోసం గిద్దలూరు పోలీసులు సైబర్ పోలీసుల సహాయం కోరినట్లు తెలుస్తోంది..
మరో ఆలోచన…
అధికారులు ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఆ వ్యవహారం ఇలా ఏమైనా బయటకు వచ్చేలా సరదాగా పోస్ట్ చేసి ఉంటారా అనే ఆలోచనలో కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు..