OYOలో యువతి మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్ పగిలినట్లు గుర్తించిన పోలీసులు
బెడ్‌తో పాటు రూమ్ గోడలపై రక్తపు మరకలను గుర్తింపు
మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు
నిన్న మధ్యాహ్నం 1:48 గంటలకు ఓయో హోటల్‌కు వచ్చిన నిఖిత.. కొద్దిసేపటి తర్వాత హోటల్ కి వచ్చిన శ్రీనివాస రవితేజ
అర్ధరాత్రి యువతి స్పృహ కోల్పోయిందంటూ రవితేజ తన వద్దకు వచ్చాడని తెలిపిన హోటల్ సూపర్వైజర్
అంబులెన్స్‌లో తీసుకెళ్దామంటే.. వద్దు, బైక్ చాలని నిఖితను ఆసుపత్రికి తీసుకెళ్లిన రవితేజ
అనంతరం నిఖిత మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో, అక్కడి నుంచి పరారైన రవితేజ
ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు వ్యత్యాసం.. అబ్బాయి కంటే అమ్మాయే పెద్దదని గుర్తింపు
కేసు నమోదు చేసి.. ప్రస్తుతం పరారీలో ఉన్న రవితేజ కోసం గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్ధిఖీ నగర్‌లోని ఓ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది హత్య అయి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షారోన్ నిఖిత తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఓయో యాప్ ద్వారా మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని ‘హోటల్ OSLN టెర్మినస్’లో 303వ నంబర్ గదిని ఇద్దరూ అద్దెకు తీసుకున్నారు.అయితే తెల్లవారుజామున సుమారు ఒంటిగంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. షారోన్ నిఖితను ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ, హోటల్ సిబ్బందితో కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉండటంతో అనుమానాలు బలపడ్డాయి…యువతి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే, ఆసుపత్రికి వచ్చిన శ్రీనివాస రవి తేజ అక్కడి సిబ్బంది కంటపడకుండా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అతడిపై పోలీసులకు మరింత అనుమానం కలిగింది. ఘటనా స్థలమైన హోటల్లోని 303వ నంబర్ గదిని పరిశీలించిన పోలీసులకు గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
ప్రాథమిక ఆధారాల ప్రకారం శ్రీనివాస రవి తేజే యువతిపై దాడి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి అసలు కారణాలు స్పష్టమవుతాయని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రవి తేజ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.