మిథునా యాడ్స్’ అధినేత కె. శోభారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం.. బెదిరిస్తే పేర్లు బయటపెడతా

తన వ్యాపార సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, సీఎంకు సన్నిహితుడిగా భావించిన వ్యక్తి ఒకరు తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని కోరారంటూ ‘మిథునా యాడ్స్’ అధినేత కె. శోభారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా పంచుకున్న ఆమె.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో చిన్న సంస్థలకు యాడ్స్ కేటాయించకుండా కేవలం తమకు తెలిసిన వారికే అప్పజెబుతున్నారని శోభారెడ్డి ఆరోపించారు.

యశస్వినీ, మీనాక్షి నో రెస్పాడ్:
నా వ్యాపార సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని భావించి గతేడాది అక్టోబర్‌లో సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తిని కలిస్తే తననుగెస్ట్ హౌస్ కు రావాలని పిలిచాడని ఆరోపించారు. అవకాశాల కోసం వచ్చిన మహిళల పట్ల పెద్ద మనసుతో ప్రవర్తించాలి తప్ప ఇలాంటి సంస్కృతి సరికాదన్నారు. మహిళలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని అందరూ ఒకే రకంగా ఉండరని వ్యాఖ్యానించారు. తన స్వగ్రామం పాలకుర్తి నియోజకవర్గంలోని ముత్తారం అని, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సైతం వాట్సాప్ మెసేజ్ చేసినా స్పందించలేదని, ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిపారు. చివరికి ఏఐసీసీ (AICC) వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు మెసేజ్ చేసినా సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాపార పరంగా జరుగుతున్న అన్యాయంపై న్యాయం చేయమని కోరితే, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా సమస్యను బయటకు చెబితే సీఎంకు దగ్గరి వాళ్లమని చెప్పుకుంటూ బెదిరిస్తున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాను. నన్ను భయపెట్టాలని లేదా రెచ్చగొట్టాలని చూస్తే ఏమాత్రం తగ్గేదే లేదు. ఇప్పటివరకు పేర్లు రివీల్ చేయకుండా ప్రశాంతంగా ఉన్నాను.. నన్ను ఇంకా బెదిరిస్తే పేర్లు కూడా బయటపెడతాను. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు” అని శోభారెడ్డి స్పష్టం చేశారు.