భద్రతా మండలిలో పాక్‌ వింత వాదన..

ఉగ్రవాదానికి చిరునామాగా ఉన్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్‌ఛైర్మన్‌ హోదాను కట్టబెట్టడం విమర్శలకు దారి తీస్తోంది..తాలిబన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా పాక్‌కు అప్పగించడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని మిగిలిన సభ్య దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలోనే ఐరాస కమిటీల కేటాయింపు ప్రక్రియ జరగాల్సి ఉండగా కేవలం పాక్‌ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఐదు నెలలు ఆలస్యమైందని తెలిపాయి. ”పాకిస్థాన్‌ మంకుపట్టు, అహేతుక డిమాండ్లపై మండలిలోని ఇతర సభ్యులు విసిగిపోయారు.

ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యంగా చేసే పాక్‌ ప్రయత్నాలకు ఇతర సభ్యులు మద్దతు పలికేందుకు సిద్ధంగా లేరు. మండలి శాశ్వత సభ్య దేశాలు- చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఏ కమిటీకీ నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదు. పాక్‌కు కేటాయించిన స్థానం నామమాత్రమైనదే. కానీ.. తాలిబన్‌ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్, కాబుల్‌ మధ్య అభిప్రాయభేదాలు తగ్గేందుకు అవకాశం ఉంది” అని వివరించాయి. భద్రతామండలిలోని ఆంక్షల కమిటీ, తాలిబన్‌ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీల అధ్యక్ష పదవులను పాక్‌ డిమాండ్‌ చేసింది. తాలిబన్‌ కమిటీతో పాటు, ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్‌ ఛైర్మన్‌ హోదాలను భద్రతా మండలి ఇచ్చింది..