Pakistan Spy Network.. ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం రేపుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 18 మందిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’లో భాగంగా ఏకకాలంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి…ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో గుర్తించిన 18 మంది అనుమానితుల్లో 13 మంది నేవీ సిబ్బందిగా ఉన్నట్లు సమాచారం. వీరు పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో నేరుగా టచ్లో ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారం చేరవేసినట్లు వచ్చిన అనుమానాలపై విచారణ కొనసాగుతోంది..
ఎన్క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా సమాచారం లీక్.
భారత నావికాదళం, వివిధ రక్షణ సంస్థల సమాచారమే లక్ష్యంగా ఈ గూఢచర్యం సాగినట్లు అధికారులు స్పష్టం చేశారు. అనుమానితులంతా అత్యంత రక్షణ కలిగిన ‘ఎన్క్రిప్టెడ్ ఛానళ్ల’ ద్వారా సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. తనిఖీల సందర్భంగా అనుమానితుల నుంచి పెద్దెత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అరెస్ట్
ఈ కేసులో విశాఖకు చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్కు చేరవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనను కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో విశాఖ జిల్లా జైలుకు తరలించారు.
కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి అరెస్ట్
ఇదే కేసులో కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్కు చెందిన వాట్సాప్ యాక్టివేషన్ కోసం OTP షేర్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో కమ్యూనికేషన్, కీలక సమాచారాన్ని చేరవేసిన అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రదీప్ ముఖర్జీని ట్రాన్సిట్ వారెంట్పై కోయంబత్తూరు నుంచి విజయవాడకు తరలించారు. అనంతరం కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నట్లు సమాచారం.
మిగిలిన అనుమానితులపై దర్యాప్తు
మొత్తం 18 మంది అనుమానితుల్లో మిగిలిన 16 మందికి సంబంధించిన పాత్రపై కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో వారి సంబంధాలు, సమాచార మార్పిడి, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. అయితే, విశాఖలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్లిందా? ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం