టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లకు మనోళ్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు.రెండు జట్ల మధ్య మ్యాచ్ లు ఐసీసీ, ఆసియా కప్ సందర్భంగా మాత్రమే జరుగుతున్నాయి. గతంలో మాత్రం రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవి, కానీ ఇప్పుడు పూర్తిగా రద్దయ్యాయి. ఈ తరుణంలోనే టీమిండియా, పాక్ ద్వైపాక్షిక సిరీస్ లపై తాజాగా మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. భారత దేశం చాలా గొప్పదని.. పాక్ ప్లేయర్లకు ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు. గతంలో ఇండియా పర్యటనకు వెళ్లినప్పుడు, పాక్ ప్లేయర్లకు మంచి గౌరవం దక్కేదని గుర్తు చేశాడు. శత్రువుకైనా అన్నం పెట్టేవాళ్లని మెచ్చుకున్నాడు.
టీమిండియా ప్లేయర్లతో కలిసి భోజనం చేసేవాళ్లం
తాను జట్టులో ఉన్నప్పుడు.. 5 సార్లు ఇండియా పర్యటనకు వెళ్లానన్నాడు. ఆ సమయంలో భారత అభిమానులు కూడా తమ ఆటను ఆస్వాదించేవారని, స్నేహా భావంతో మెదిలేవారని వెల్లడించాడు. ఇరు దేశాల అభిమానుల మధ్య కూడా స్టేడియంలో గొడవలు జరుగులేదని గుర్తు చేశాడు. అందరూ స్నేహ భావంతో వ్యవహరించేవారన్నాడు. పాక్ పర్యటనకు టీమిండియా ప్లేయర్లు వచ్చినా మంచి మర్యాదలే చేసేవాళ్లమన్నాడు. చాలా సార్లు డ్రెస్సింగ్ రూంలో తమతో టీమిండియా ప్లేయర్లు గడిపేవారన్నాడు. భోజనం కూడా కలిసి చేసేవాళ్లమని చెప్పుకొచ్చాడు. షాహిద్ అఫ్రిది ఇంటికి కూడా కొందరు టీమిండియా ప్లేయర్లు వెళ్లి దావాత్ లు చేసుకున్నారన్నాడు. షోయబ్ అక్తర్ తో టీమిండియా ప్లేయర్లు చాలా క్లోజ్ గా ఉండేవాళ్లని స్పష్టం చేశాడు. రావాల్పిండిలో మ్యాచ్ లు జరిగినప్పుడు టీమిండియా ప్లేయర్ల కోసం ఇంటి నుంచి షోయబ్ అక్తర్ బిర్యానీ తీసుకొచ్చేవాడని వెల్లడించాడు. అప్పుడు అందరం కలిసి, తినేవాళ్లమన్నాడు.