కేదారాల్లో నాలుగవది మధ్య మహేశ్వర్! సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే! అలాగే పరమ శివుని శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలు పంచ కేదారాలుగా విరాజిల్లుతున్నాయి. వాటిల్లో నాలుగవది మధ్య మహేశ్వర్ క్షేత్రం. ఈ కథనంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన మధ్య మహేశ్వర్ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం..
పంచ కేదారాలు – Panch Kedars.
మధ్య మహేశ్వర్ ఆలయం ఎక్కడుంది?
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3497 మీటర్ల ఎత్తులో మధ్యమహేశ్వర్ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయం చౌఖంబ, నీలకంఠ్, కేదార్ నాథ్ పర్వత శిఖరాలకు అభిముఖంగా కనిపిస్తుంది. మధ్య మహేశ్వర్ ఆలయాన్ని చేరుకోవాలంటే రాన్సీ గ్రామం మీదుగా 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
మధ్య మహేశ్వర్ విశిష్టత.
Madhyamaheshwar Temple.
పరమ శివుని శరీర భాగాల్లో నాభి పడిన ప్రాంతంగా మధ్య మహేశ్వర్ ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ శివలింగం నాభి రూపంలో దర్శనమిస్తుంది. మధ్య మహేశ్వర్ ఆలయానికి చుట్టూ కనిపించే చౌఖంబ, నీలకంఠ్, కేదార్నాథ్ పర్వతాల సౌందర్యం ఎంత చూసినా తనివి తీరదు.
స్థల పురాణం
భీముడు వృషభ రూపంలో ఉన్న శివుని తోక పట్టుకుని లాగబోగా ఆ వృషభం భూమిలోకి వెళ్లిపోతుంది. ఆ క్రమంలో శివుని శరీర భాగాలు అయిదు ప్రదేశాల్లో పడుతాయి. అవే పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో నాలుగవది అయిన మధ్య మహేశ్వర్‌లో శివుని నాభి భాగం పడిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. పాండవ మధ్యముడైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఆలయ విశేషాలు
ప్రధాన ఆలయంలో నాభి రూపంలోని శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఆలయానికి కుడి వైపున ఒక చిన్న ఆలయంలో పాలరాయితో చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు.
కొన్ని చుక్కలే చాలు
ఆలయ ప్రాంగణం నుంచి వచ్చే నీరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ప్రవాహం నుంచి కొన్ని చుక్కలు కూడా అభ్యంగన స్నానం చేయడానికి సరిపోతాయని స్థానికులు చెప్పడం విశేషం.
ఎప్పుడు సందర్శించాలి?
ఉత్తరాఖండ్‌లోని ఇతర ఆలయాలకు మాదిరిగానే మధ్య మహేశ్వరుని ఆలయం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంటుంది. మే నుంచి నవంబర్ మధ్య ఎప్పుడైనా మధ్యమహేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. వర్షాకాలంలో ఈ యాత్ర కొంత కఠినతరం. అయితే వర్షాకాలం ముగిసిన తరువాత ఈ ఆలయం సందర్శనకు అత్యంత అనువైన సమయం.
శీతాకాల విడిది
శీతాకాలంలో హిమపాతం కారణంగా నవంబర్ నుంచి మే వరకు మధ్య మహేశ్వర ఆలయాన్ని మూసేస్తారు. ఈ సమయంలో మధ్య మహేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని దిగువున ఉన్న ఊఖిమఠ్ కు తరలించి అక్కడే పూజాదికాలు నిర్వహిస్తారు.
దివ్యానుభూతి నిచ్చే ప్రకృతి సౌందర్యం
ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రదేశాల మాదిరిగానే మధ్యమహేశ్వర్ వద్ద కూడా శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పచ్చని లోయలు, పక్షుల కిలకిలల మధ్య వేసవిలో ఈ ప్రాంతంలో అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడా మధ్య మహేశ్వర్‌ను సందర్శించడం కూడా పంచ కేదారాల యాత్రలో భాగమేనని స్థానికులు అంటారు.
మధ్య మహేశ్వర్ ఎలా చేరుకోవాలి?
దెహ్రాదూన్‌లోని విమానాశ్రయం నుంచి ఊఖిమఠ్ చేరుకోడానికి ప్రయివేటు వాహనాలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మధ్య మహేశ్వర్ కు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హరిద్వార్ రైల్వేస్టేషన్ కు 202 కి.మీ దూరంలో ఉన్న ఊఖిమఠ్ వరకు వాహనాలలో చేరుకొని అక్కడ నుంచి 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయడం ద్వారా మధ్య మహేశ్వర్ చేరుకోవచ్చు.
మధ్య మహేశ్వర్ యాత్ర ఎంతో కఠినమైనప్పటికీ ఒక్కసారి అక్కడకు చేరుకోగానే ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశించిన భక్తులు ఇక అక్కడ నుంచి వెళ్లబుద్ధి కాదని చెప్పడం గమనార్హం.
జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చేయాల్సిన యాత్ర మధ్య మహేశ్వర్ యాత్ర!
ఓం నమః శివాయ!
గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని వీక్షకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం..!