జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి భారీ షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే రేపు (జూన్ 2) హైదరాబాద్లో తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు..తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు పవన్ కళ్యాణ్.. హైదరాబాద్లో భారీ సభకు ప్లాన్ చేశారు. ఐతే.. కొన్ని కారణాలతో పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది హాట్ టాపిక్ అవుతోంది.
జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఈ రోజున తెలంగాణలో భారీగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతోంది. ఇలాంటి సమయంలో గచ్చిబౌలిలో జూన్ 2న సభను నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. ఐతే.. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం.. జనసేన పార్టీకి షాక్ లాగా మారింది.
ఇప్పుడు జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ఏయే కారణాలతో సభకు అనుమతి ఇవ్వలేదో.. ఆ వివరాల్ని కోర్టుకు వివరించి.. సభకు అనుమతి ఇప్పించాల్సిందిగా కోర్టును కోరే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. ఐతే.. కోర్టులో రేపు పిటిషన్ వేస్తే, దాన్ని కోర్టు రేపే విచారణకు స్వీకరిస్తుందా లేక.. పిటిషన్ను తిరస్కరిస్తుందా అనేది జూన్ 2న తెలిసే అవకాశాలు ఉంటాయి.
ఇలా పోలీసులు అనుమతి నిరాకరించవచ్చా అనేది ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు సభలు నిర్వహించుకోవచ్చు. దానికి కచ్చితమైన కారణాలు ఉంటేనే పోలీసులు అనుమతి నిరాకరించవచ్చు. కానీ.. ఇలా అనుమతి నిరాకరిస్తే, దీని వల్ల ఆయా పార్టీలకు మైలేజ్ పెరగగలదు. ఇదివరకు ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జనసేన ర్యాలీలు, సభలకు వైసీపీ అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. దాంతో ఆ సమస్యలు జనసేనకు ప్లస్ అయ్యాయి. మరి తెలంగాణలోనూ అలాగే రియాక్షన్ వస్తుందా అనేది మున్ముందు తెలుస్తుంది.