బాధ్యులెవరినీ విడిచిపెట్టేది లేదు..మోడీ.

పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లును పాస్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ…విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న పేపర్ మాఫియా, లీకేజీ ముఠాలపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బాధ్యులెవరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ బిల్లు మన పరీక్ష వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనుందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీకేజీల సమస్యను ఎదుర్కొంటున్నాయని.. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అందుకే విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తూ సమగ్ర సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో ఇది మోదీ పోస్ట్ చేసిన నాలుగో వీడియో కావడం గమనార్హం.

గురువారం పార్లమెంట్‌లో ఉభయ సభలు పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కీలకమైన బిల్లును ఆమోదించాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ తనదైన శైలిలో అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రతి రాష్ట్రం పేపర్ లీక్‌లతో ఇబ్బంది పడుతోందని.. పేపర్ లీక్ చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు పార్లమెంటులో ఈ కఠినమైన నిబంధనలతో కూడిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసినట్లు తెలిపారు. ట్రాస్క్ ఫోర్స్‌ల ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థలు, రాష్ట్రాల సలహాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎక్కువ కాలం సాగనివ్వబోమని.. అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తూ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) స్వప్నాన్ని సాకారం చేసుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు.