సరిహద్దు వద్ద భారీగా సైనికుల మోహరింపు.. సమస్యలు కొలిక్కి వచ్చేనా..
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు మరోసారి జరగనున్నాయి. ఇప్పటి వరకు ఉద్రిక్తలు తగ్గించే విషయంపై.. 18 సార్లు సమావేశాలు జరగ్గా.. ఈ రోజు 19వ దఫా చర్చ జరగనున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా.. భారత్, చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి. 18వ దఫా చర్చలు ఏప్రిల్ 23న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు వేదికగా చుషుల్-మోల్డో సరిహద్దులోని భారత్ వైపు ప్రాంతం అని తెలుస్తోంది…
ఎటువంటి పరిణామాలు ఎదురైనా ధీటుగా తిప్పికొట్టేలా భారత్, చైనాలు వ్యూహాత్మకంగా బలగాలను మోహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులు, 90 యుద్ధ ట్యాంకులను మోహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి..అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలపై డేగ కళ్లతో నిఘా ఉంచి, వారి చర్యలను అడ్డుకోడానికి భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌యూ-30ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను పంపినట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘటనను దృష్టిలో ఉంచుకున్న రక్షణశాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఎల్‌ఏసీ వెంబడి విపత్కర పరిస్థితుల్లో ఆయుధాలు, బలగాలను మోహరింపునకు వీలులేని ప్రాంతాల్లో తక్షణమే అందుబాటులో ఉండేలా యుద్ధ సామగ్రిని నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేసింది. వ్యూహాత్మక ఎయిర్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది..