మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…

వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.3వరకు పెంచిన సంగతి తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64, డీజిల్ ధర రూ.91.58కు చేరింది. శుక్రవారం నాడే కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.3 చొప్పున పెంచింది. దీంతో పెట్రోల్ రూ.94.77 నుంచి రూ.97.77, డీజిల్ రూ.87.67 నుంచి రూ.90.67కు పెరిగింది.

తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.94.08కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70, డీజిల్ రూ.96.07కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసల పెంపు నమోదైంది. దాని తర్వాత ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసలు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకావం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి..