కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సందేశం…!

కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సందేశమిచ్చారు. చట్టాలు, నియమ నిబంధనలు అనేవి జన జీవితాలను సులభతరం చేసేలా ఉండేలా తప్ప, వారిపై భారంగా మారకూడదని మంత్రులకు ప్రధాని హితవు పలికారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నూతన మార్గదర్శకాల కారణంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

బుధవారం దిల్లీలో జరిగిన అధికార ఎన్‌డీఏ కూటమి ఎంపీల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఈమేరకు సందేశాన్ని ఇచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి రాకుండా చూడాలని ఎంపీలు, మంత్రులకు ప్రధాని సూచించారని తెలిపారు. మంచి నియమ నిబంధనలు అనేవి వ్యవస్థలను మెరుగుపర్చేలా ఉండాలే తప్ప, ప్రజలను వేధించేలా ఉండకూడదని ప్రధాని తేల్చి చెప్పారని రిజిజు పేర్కొన్నారు. అనవసరంగా సాధారణ పౌరులకు ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగించే చట్టాలు కానీ, నియమ నిబంధనలు కానీ లేకుండా చూడాలని కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించారని తెలిపారు. ప్రభుత్వ రూల్స్ వల్ల ప్రజలకు సౌకర్యం కలగాలనే అభిప్రాయాన్ని నరేంద్రమోదీ వ్యక్తం చేశారన్నారు…..

ఇండిగోకు డీజీసీఏ కఠిన ఆదేశాలు.

మరోవైపు ఇండిగోకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో విమాన సర్వీసులను అందించడంలో విఫలమైనందున, విమాన సర్వీసుల సంఖ్యను 5 శాతం మేర తగ్గించాలని ఇండిగోకు నిర్దేశించింది. విమానయాన సేవల అన్ని విభాగాల్లో సర్వీసులు సకాలంలో అందుబాటులో ఉండేలా సమీక్షించుకోవాలని, తగిన ఏర్పాట్లు తీసుకోవాలని సూచించింది. ఒక రూట్‌లో ఒకే విమానంతో విమాన సర్వీసులను నడిపే పద్ధతిని ఆపాలని ఇండిగోను డీజీసీఏ హెచ్చరించింది. విమాన సర్వీసుల రద్దుకు దారితీసే పద్ధతులను పాటించడాన్ని ఆపాల్సిందే అని తేల్చి చెప్పింది. విమాన సర్వీసుల రివైజ్డ్ షెడ్యూళ్ల సమాచారాన్ని గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమర్పించాలని ఇండిగోను కోరింది. మొత్తంమీద ఇండిగో సంక్షోభం గురించి నేరుగా ప్రస్తావించకుండానే, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాని సూచన మేరకు విమానయాన రంగానికి సంబంధించిన నిబంధనలను సరళతరం చేస్తూ ఏదైనా నిర్ణయం వెలువడుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి…

షోకాజ్ నోటీసులకు బదులిస్తూ ఇండిగో లేఖ
విమాన పైలట్ల పనిగంటలపై పరిమితులను విధిస్తూ గత సంవత్సరం కొన్ని నూతన మార్గదర్శకాలను డీజీసీఏ జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చేందుకు అన్ని విమానయాన సంస్థలకు నిర్దిష్ట గడువును ఇచ్చింది. అయితే ఈ గడువులోగా మార్గదర్శకాల మేరకు సంస్థాగత ఏర్పాట్లను ఇండిగో ఎయిర్ లైన్స్ చేసుకోలేకపోయింది. ఈనేపథ్యంలో గత వారం రోజుల వ్యవధిలో ప్రతిరోజు వందలాది విమానాలను ఇండిగో రద్దు చేసుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌, సీఓఓ ఇసిడ్రె పోర్క్వెరస్‌లకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు ఎందుకు రద్దు అవుతున్నాయి అనే దానిపై వివరణ ఇవ్వమని ఆ నోటీసుల్లో కోరారు. దీనికి బదులిస్తూ సోమవారం రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇండిగో ఓ లేఖను పంపింది. ఇందులో పలు కీలకమైన అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై చర్చించి, ఇండిగో సంక్షోభానికి త్వరితగతిన ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు తాజాగా మంగళవారం రోజు అత్యున్నత స్థాయి సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో కేంద్ర పౌర విమానయాన శాఖ, విమానయాన సంస్థలు, డీజీసీఏ, ఇతర అనుబంధ విభాగాల సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు..