కేథలిక్ ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం గత నెలలో డిశ్చార్జి అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ లో పోప్ తన నివాసంలో మరణించారని వాటికన్ పేర్కొంది..
పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేశాయి. ఈ అనారోగ్యం కారణంగానే ఆయన ఫిబ్రవరి 14 నుండి 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత నెలలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. చివరికి ఈ సమస్యలతో పోరాడుతూ ఆయన మరణించారు.
చివరి క్షణాల వరకు సేవలో..
ఆశ్చర్యకరంగా, పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో భక్తులకు సందేశం ఇచ్చారు. దాదాపు 35,000 మంది ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “సోదర సోదరీమణులారా, హ్యాపీ ఈస్టర్..!” అని ఆయన స్వయంగా పలికారు. అయితే, ఆయన పూర్తి సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. ఈ సందేశంలో గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్ వంటి యుద్ధ సంక్షోభిత ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని ఆయన ప్రార్థించారు. అనారోగ్యం పాలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య ప్రయాణిస్తూ, చిన్నారులను ఆశీర్వదించారు. ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉష పోప్ను కలిశారు. వారికి పోప్ చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ను బహూకరించారు.