పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బు సంపాదన పేరుతో యువత, పిల్లలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ మనీ గేమ్స్‌పై నియంత్రణ విధిస్తూ, అదే సమయంలో ఈ-స్పోర్ట్స్ మరియు సామాజిక గేమింగ్‌కు ప్రోత్సాహం ఇచ్చేలా కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి… Promotion and Regulation of Online Gaming (PROG) Act, 2025 కింద రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026మే 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ చట్టం ప్రధాన లక్ష్యం ప్రజలను, ముఖ్యంగా పిల్లలు మరియు యువతను ఆన్లైన్ మనీ గేమ్స్ వల్ల కలిగే ఆర్థిక, మానసిక, సామాజిక నష్టాల నుంచి రక్షించడం. ఇటీవల ఆన్లైన్ గేమింగ్ పేరుతో భారీగా డబ్బు కోల్పోయిన ఘటనలు, వ్యసనానికి గురైన యువత సంఖ్య పెరగడం, మోసపూరిత యాప్‌లు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
కొత్త నియమాల ప్రకారం దేశవ్యాప్తంగా Online Gaming Authority of India అనే ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇది ఎలక్ట్రానిక్స్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఆన్లైన్ గేమ్స్‌ను పరిశీలించి అవి మనీ గేమ్స్ కిందకా, ఈ-స్పోర్ట్స్ కిందకా, లేక సామాజిక గేమ్స్ కిందకా వస్తాయో నిర్ణయిస్తుంది. అలాగే ఫిర్యాదులు స్వీకరించడం, సేవలపై ఆదేశాలు జారీ చేయడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం వంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది.
ఒక గేమ్‌లో డబ్బు పెట్టాల్సి వస్తుందా? గెలిస్తే నగదు బహుమతులు వస్తాయా? గేమ్ ఆదాయ విధానం ఎలా ఉంది? గేమ్‌లో సంపాదించిన రివార్డ్స్‌ను బయట నగదుగా మార్చుకునే అవకాశం ఉందా? వంటి అంశాల ఆధారంగా గేమ్ స్వభావాన్ని నిర్ణయిస్తారు. అవసరమైతే 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ-స్పోర్ట్స్‌గా గుర్తింపు పొందాలనుకునే గేమ్స్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆమోదం లభించిన తర్వాత ప్రత్యేక డిజిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇది గరిష్టంగా 10 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. అయితే డబ్బు ఆధారిత మనీ గేమ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ-స్పోర్ట్స్ హోదా ఇవ్వరు.
వినియోగదారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త రూల్స్ ప్రకారం వయసు నిర్ధారణ, పిల్లల కోసం పరిమితులు, పేరెంటల్ కంట్రోల్, సమయ పరిమితి, ఫిర్యాదు నమోదు సదుపాయం, కౌన్సెలింగ్ సహాయం వంటి భద్రతా ఫీచర్లు తప్పనిసరి. గేమింగ్ సంస్థలు తమ భద్రతా చర్యలు స్పష్టంగా తెలియజేయాలి.
ఫిర్యాదుల పరిష్కారానికి రెండు దశల వ్యవస్థ తీసుకొచ్చారు. ముందుగా గేమింగ్ సంస్థే సమస్యను పరిష్కరించాలి. అది సంతృప్తికరంగా లేకపోతే వినియోగదారు ఆన్లైన్ గేమింగ్ అథారిటీని సంప్రదించవచ్చు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి స్థాయి అప్పీల్ వ్యవస్థ ఉంటుంది.
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలు, సేవల నిలిపివేత వంటి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది. బ్యాంకులు, పేమెంట్ యాప్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు నిషేధిత మనీ గేమ్స్‌కు లావాదేవీలు జరగకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు మోసపూరిత మనీ గేమ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు నిజమైన ఈ-స్పోర్ట్స్ రంగానికి అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం ముందడుగు వేసిందని చెప్పవచ్చు..