చెన్నై సూపర్ కింగ్స్ విజయం..

చెన్నై సూపర్ కింగ్స్ విజయం..
సూపర్ కింగ్స్ సూపర్ గా రాణించారు.. ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన తొలి సీఎస్‌కే బ్యాటర్‌గా నిలిచాడు…19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎస్‌కే బ్యాటర్ కూడా ముంబైపై శతకం నమోదు చేయలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

మాజీ ఛాంపియన్ల పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి. ఏకపక్ష మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై పంతొమ్మిదో సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో సంజూ శాంసన్(101 నాటౌట్) మెరుపు శతకంతో భారీ స్కోరందించగా.. స్నిన్నర్లు అకీల్ హొసేన్(4-17), నూర్ అహ్మద్‌(2-24)లు ముంబై బ్యాటర్లను వణికించారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. హిట్టర్లంతా నట్టేట ముంచగా ముంబై 104కే కుప్పకూలగా సీఎస్కే భారీ విజయంతో రెండు పాయింట్లు సాధించింది..

ఐపీఎల్‌లో అతి గొప్ప పోరాటాల్లో ఒకటైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పంజా విసిరింది. వాంఖడేలో సంజూ శాంసన్(101 నాటౌట్) శతక గర్జనతో ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై స్పిన్నర్ల విజృంభణతో అదిరే విజయం సాధించింది. ఇంప్యాక్ట్ సబ్ అకీల్ హొసేన్(4-17) తన మొదటి ఓవర్లోనే ఓపెనర్‌ డానిష్ మలేవర్‌(0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ముకుల్ చౌదరీ ఓవర్లో డికాక్(7) బంతిని వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. తన రెండో ఓవర్లో డేంజరస్ నమన్ ధిర్‌(0)ను బౌల్డ్ చేసిన అకీల్ ముంబైని ఒత్తిడిలో పడేశాడు. 11 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిన వేళ గత మ్యాచ్ సెంచరీ హీరో తిలక్ వర్మ(37), సూర్యకుమార్ యాదవ్‌(36)లు ఆచితూచి ఆడారు..

సంజూ శాంసన్ నిలకడగా ఆడుతూ..

తనదైన నిశ్శబ్ద శైలితో క్రీజులోకి అడుగుపెట్టిన చెటా.. ఆ తర్వాత గేర్లు మార్చి ప్రత్యర్థి బౌలింగ్‌ను విచ్ఛిన్నం చేశాడు. పవర్ ప్లేలో గ్యాప్ షాట్స్‌తో బౌండరీలు బాదిన సంజూ.. మిడిల్ ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ ఒకటి కాదు.. రెండు కాదు ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు..

1. రోహిత్ రికార్డ్ సమం..

ఈ సీజన్‌లో సంజూ శాంసన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 8వ టీ20 సెంచరీ. దాంతో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డ్‌ను సంజూ శాంసన్ సమం చేశాడు. ఈ జాబితాలో 9 సెంచరీలతో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సంజూ శాంసన్ 8 శతకాలతో రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఈ సీజన్‌లో మరో శతకాలు బాదితే కోహ్లీ రికార్డును కూడా సంజూ బద్దలు కొట్టనున్నాడు.

2. ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు

ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా సంజూ శాంసన్ రికార్డు సాధించాడు. 2018లో షేన్ వాట్సన్ మాత్రమే సీఎస్‌కే తరపున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు నమోదు చేశాడు.

3. ముంబైపై శతక్కొట్టిన తొలి CSK బ్యాటర్

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన ఏకైక సీఎస్‌కే బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రమే. ఎందరో దిగ్గజాలు సీఎస్‌కే తరపున ఆడినా.. ముంబై ఇండియన్స్‌పై సెంచరీ సాధించలేకపోయారు. ఆ లోటును తాజా శతకంతో సంజూ తీర్చాడు.

4. రాహుల్ రికార్డ్ సమం..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. సంజూకు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. దాంతో కేఎల్ రాహుల్(5) రికార్డును సంజూ సమం చేశాడు. ఈ జాబితాలో 8 శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. జోస్ బట్లర్(7), క్రిస్ గేల్(6) శాంసన్ కంటే ముందున్నారు.

5. సీఎస్‌కే క్లబ్‌లో సంజూ..

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సంజూ చేరాడు. మురళీ విజయ్ (2), షేన్ వాట్సన్ (2), రుతురాజ్ గైక్వాడ్ (2) తర్వాత సీఎస్‌కే తరఫున రెండు శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు….