ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు..విదేశీ క్రికెటర్లకు మిలిటెంట్‌ గ్రూప్‌ హెచ్చరిక..

మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లెవరూ ఇక్కడకు రావొద్దని ఆ దేశానికి చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ జమాత్‌-ఉల్‌-అహ్రర్‌ హెచ్చరించింది…ఇక్కడ భద్రత ఉండదని, ప్రస్తుతం దేశం క్రీడలకు ఆతిథ్యమిచ్చే పరిస్థితుల్లో లేదని తెలిపింది. పీఎస్‌ఎల్‌-11 మ్యాచ్‌లను కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పిన ఆ గ్రూప్‌.. ఈ మేరకు విడుదల చేసిన ఓ లేఖలో ‘ప్రస్తుతం పాకిస్థాన్‌లో మరీ ముఖ్యంగా బలూచిస్థాన్‌, ఖైబర్‌ పంక్తుంఖ్వా ప్రజలు తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. ఈ ప్రాంతాల్లో పాకిస్థాన్‌ ఆర్మీ మా బిడ్డలపై రక్తపుటేరులను పారిస్తున్నది. ఇలాంటి సమయంలో పీఎస్‌ఎల్‌ను నిర్వహించడం పుండు మీద కారం చల్లినట్టే…

ఈ సందర్భంగా పీఎస్‌ఎల్‌లో పాల్గొనబోయే విదేశీ క్రికెటర్లకు ఒక్కటే చెబుతున్నాం. మీరు తక్షణమే టోర్నీని బహిష్కరించండి. ఇక్కడ భద్రత లేదు. క్రికెట్‌కు మేం వ్యతిరేకం కాదు. కానీ పీఎస్‌ఎల్‌ను మాత్రం కచ్చితంగా అడ్డుకుంటాం. ఒకవేళ మా మాటను బేఖాతరు చేసి మీరు (క్రికెట్‌ బోర్డులు) క్రికెటర్లను ఇక్కడకు పంపిస్తే వారికి ఏం జరిగినా మా బాధ్యత లేదు. ఈ లీగ్‌కు మాత్రం అడుగడుగునా అంతరాయం కలిగించడం మాత్రం గ్యారంటీ.. ఆటగాళ్లను మైదానంలో అడుగుపెట్టనివ్వం’ అని హెచ్చరించింది. ఇదిలాఉండగా జమాత్‌-ఉల్‌-అహ్రర్‌ హెచ్చరించినా ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. సోమవారం కరాచీ చేరుకోవడం గమనార్హం…