తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు…!

ఈరోజు ఉదయం నుంచే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో సర్వర్ సమస్య తలెత్తడంతో.. అన్ని రకాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఈసీ (EC), మార్కెట్ విలువల వివరాలు, ఇతర ఆన్‌లైన్ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని.., అవసరమైన పత్రాలతో కార్యాలయాలకు వచ్చినవారు.. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వర్ ఎప్పుడు సరిదిద్దుతారో స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సేవలు ఎప్పుడు పునరుద్ధరించబడతాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తక్షణమే సమస్యను పరిష్కరించి సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.