సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూత…

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

అదే బాధతో శనివారం రాత్రి ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రఘునాథరెడ్డి సుమారు 350 చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయన భౌతిక కాయానికి నటి శివపార్వతి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు, ఎన్నో సహాయపాత్రలు చేసిన వ్యక్తి మరణిస్తే టాలీవుడ్ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం, భద్ర తదితర సినిమాల్లో నటించారు. శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమాతో ఆయన ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యారు. రఘునాథరెడ్డి చివరిగా 2018లో సుమంత్ హీరోగా చేసిన సుబ్రహ్మణ్యపురంలో నటించారు.