రైస్ మిల్లుల బూడిద నుండి కాపాడండి మహాప్రభో….!

మిల్లు నుంచి బయటకు వచ్చే బూడిదను పూర్తిగా నియంత్రించాలి..

కాలుష్య నియంత్రణ బోర్డు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి..

స్థానికుల ఆరోగ్యం కాపాడండి…

మొద్దు నిద్రలో సంబంధిత అధికారులు..

నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి..

సూర్యాపేట జిల్లా..
హుజూర్ నాగర్ పట్టణంలో లింగగిరి రోడ్, మిర్యాలగూడెం రోడ్డు, సింగారం, అమరవరం, కోదాడ రోడ్డులో గల
రైస్ మిల్లుల పరిశ్రమల నుంచి వెలువడుతున్న బూడిద స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ముఖ్యంగా మిల్లుల నుంచి గాలిలోకి ఎగిరిపోతున్న బూడిద సమీప నివాసాల కాలనీలపై పడుతూ, ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి.. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…
ఉదయం, సాయంత్రం వేళల్లో గాలికి బూడిద ఎగిరిపడి ఇళ్లపై, తాగునీటితో పాటు వనరులపై, పంట పొలాలపై పేరుకుపోతోందని బాధితులు చెబుతున్నారు. దీంతో శ్వాసకోశ సమస్యలు, దగ్గు, కళ్ల మంట, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోతున్నారు.
కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం పరిశ్రమలు బూడిద బయటకు వెళ్లకుండా తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల వాటిని సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానిక ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని చెబుతున్నారు. వెంటనే కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

అధికారుల అలసత్వంపై అనుమానాలు..!.

మిల్లు నుంచి రోజూ భారీగా బూడిద వెలువడుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… పలుమార్లు ఫిర్యాదులు చేసినా తనిఖీలు, కాలుష్య నియంత్రణ చర్యలు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు.. మామూలు మత్తులో మిల్లర్లపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్లుగా ఆరోపణ వెలువెత్తుతున్నాయి..

మిల్లుల బూడిదతో రహదారిపై ప్రయాణికులకు ఇక్కట్లు.

రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న బూడిద స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మిల్లుల చిమ్నీల నుంచి ఎగిసిపడుతున్న బూడిద గాలికి ఎగిరి రహదారులపై వ్యాపిస్తుండటంతో వాహనదారుల కళ్ళల్లో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కళ్లలో బూడిద పడటం, దృష్టి మందగించడం వల్ల ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది…

అదే విధంగా రోడ్ల పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, పంట పొలాలపై కూడా బూడిద పేరుకుపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి..

రైస్ మిల్లుల్లో కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయంపై అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రహదారులపై బూడిద వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని మరియు వాహనదారుల భద్రతను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు…

రైస్ మిల్లుల బూడిదతో శ్వాసకోశ వ్యాధుల ముప్పు.. ఆందోళనలో ప్రజలు.

రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న బూడిద స్థానిక ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాలిలో కలిసే సన్నని ధూళి కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు… చర్మవ్యాధులతో పాటు శ్వాసకోస వ్యాధులు కూడా ఎక్కువగా ప్రభలుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు..
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిరంతరం బూడిదకు గురికావడం వల్ల దగ్గు, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లలో మంట, అలర్జీ వంటి సమస్యలు వచ్చి హాస్పిటల్ పాలు అవుతున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు..

అయితే నిర్దిష్టంగా ఏ ప్రాంతంలో ఎంత స్థాయిలో కాలుష్యం ఉందో, దాని వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడానికి కాలుష్య స్థాయిలు, వైద్య సమాచారం ఆధారంగా పరిశీలన అవసరం. ముఖ్యంగా కాలుష్య నియంతరణ అధికారులు మొద్దు నిద్రలో మామూలు మత్తులో తేలుతున్నట్లుగా ఆరోపణలు వెళ్లి వెతుతున్నాయి..

తినే ఆహారంలో సైతం బూడిద..

బూడిదతో కలుషితమైన ఆహారాన్ని తెలియకుండానే తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తేతున్నాయి.. వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాసకోశ లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారికి ప్రాణాల మీదకే వస్తుంది..

అయితే బూడిద పడిన ఆహారం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రభావం కలుగుతుందనేది బూడిద స్వభావం, అందులోని కణాల రకం, కాలుష్య స్థాయి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల. సంబంధిత అధికారులు మొద్దు నిద్ర విడి కాలుష్య స్థాయిని పరీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారుల బాధ్యత అని ప్రజలు కోరుతున్నారు..