రైతుభరోసాను విజయవంతంగా పూర్తి చేశామని, 70లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామన్నారు. రైతుల ఆశీర్వాదం వల్లనే తాను చిన్న వయసులోనే సీఎం అయ్యానని చెప్పారు. వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసేందుకే వైఎస్సార్ ఆనాడు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు. రైతుల అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఇవాళ్టితో పూర్తయింది. 9 రోజుల్లో 9 వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతుభరోసా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా రాజీవ్గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు : మా ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యం రైతులేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాతల తరువాత మహిళలు, యువత మా ప్రాధాన్యమని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చామని, నిలబెట్టుకున్నామని అన్నారు. 25 లక్షల మందికిపైగా అన్నదాతలకు రుణమాఫీ చేశామని, గత సీఎం కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అని చెప్పారని, మా ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పామని గుర్తు చేశారు. అంతేకాకుండా 48 గంట్లలో నగదు జమ చేశామని అన్నారు..గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు జరిగేవి. ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని పోరాటాలు చేస్తున్నారు. 18 నెలల్లో రైతుల కోసం లక్షా 4వేల కోట్లు ఖర్చు చేశాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే.. కార్యచరణతో మేం ముందుకు సాగుతున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 18 నెలల పాలనను బేరీజు వేయండి. కేసీఆర్ కుట్రలో తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ప్రాజెక్టుల పేరు, ఊరు మార్చి లక్ష కోట్లు కొల్లగట్టారు. నాడు సీమాంధ్ర పాలకు తెలంగాణను ఎడారిగా మార్చారని.. చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు. మిమ్మిల్ని ఉరి తీసినా తప్పు లేదని రైతాంగం అంటోంది. చంద్రబాబుతో ఉండాలనుకుంటే టీడీపీలోనే ఉండేవాడిని.. తెలంగాణ కోసమే రాజీవ్ ఆశీస్సులతో కాంగ్రెస్ లోకి వచ్చాం.. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం.. కేసీఆర్ చర్చకు సిద్దమా..?’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
గతంలో కేసీఆర్ కాంచీపురం వెళ్లి వచ్చేటప్పుడు నగరిలోని రోజా ఇంటికి వెళ్లిన సంఘటనను గుర్తుచేశారు. ఆమె పెట్టిన నాటు కోడి పులుసు, రాగి సంగటి తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు జీవోలు ఇచ్చింది కేసీఆర్ హయాంలోనే.. చేసిన తప్పులకు ముఖం చెల్లక ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. హరీష్ రావుతో మాట్లాడించడం కాదు.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఒక రోజు గోదావరిపై చర్చిద్దాం. ఇంకో రోజు కృష్ణా జలాలపై చర్చ చేపడుదాం. చంద్రబాబుకు వంగి సలామ్ చేసి సంతకం చేసొచ్చింది కేసీఆర్ కాదా..? తెలంగాణకు శాశ్వతంగా మరణశాసనం రాసింది కేసీఆరే. చచ్చిపోయిన బీఆర్ఎస్ను బతికించేది గోదావరి అని కేసీఆర్ భావిస్తున్నారు. గోదావరి సెంటిమెంట్ తో పార్టీని మళ్లీ బతికించుకోవాలని చూస్తున్నారు. బనకచర్ల ప్రతిపాదన దశలోనే వ్యతిరేకించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.