బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా ఆమోదం ముందు వరకు బీజేపీ ముఖ్య నేతలు టార్గెట్ గా విమర్శలు గుప్పించిన రాజాసింగ్…ఇప్పుడు సైలెంట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. తనను ఏ పార్టీ భరించదన్నారు. తెలంగాణలో బీజేపీ తప్పా మిగతా పార్టీలన్నీ ఎంఐఎంతో కలిసి పని చేస్తాయని.. అలాంటి పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంతటితో ఆగకుండా మోదీ, అమిత్ షా, యోగి సారథ్యంలో పని చేస్తానని ప్రకటించారు. దీంతో రాజసింగ్ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పాజిటివ్ వ్యాఖ్యలను పార్టీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన మాధవీలతను సైతం ముఖ్య నేతలు మందలించినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా ఉండాలని ఆమెకు సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ తిరిగి కాషాయ గూటికి చేరుతారనే చర్చ కమలం పార్టీలో జోరుగా సాగుతోంది….
రాజాసింగ్ తిరిగి బీజేపీలో వస్తార? లేక మళ్లీ నూతన పార్టీతో ముందుకు సాగాలనుకుంటున్నారా ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఆయన బీజేపీకి బలమైన హిందూత్వ ముద్రతో కూడిన నేతగానే గుర్తింపు ఉన్న నేపథ్యంలో, పార్టీ కూడా తిరిగి స్వీకరించేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణలో హిందూత్వ ఓటును కాపాడేందుకు బీజేపీకి రాజాసింగ్ మళ్లీ అవసరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ పార్టీలోకి రావడానికి రాజాసింగ్ కూడా అంగీకరిస్తే, ఇది కమలం పార్టీకి మరో బలపొందిన అడుగవుతుంది. చివరగా చెప్పాలంటే – రాజాసింగ్ పాజిటివ్ సిగ్నల్స్, బీజేపీ హుందాగా సమాధానం.. ఈ కలయికకు అధికారిక ముద్ర పడేదెప్పుడో చూడాలి!.