పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ..

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. సరిహద్దుల్లో ఏదైనా సాహసానికి లేదా కుతంత్రాలకు పాల్పడాలని చూస్తే…మునుపెన్నడూ చూడని రీతిలో నిర్ణయాత్మకమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేరళ తిరువనంతపురంలో జరిగిన ‘సైనిక్ సమ్మాన్ సమ్మేళన్’లో పాల్గొన్న ఆయన.. ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్ తన భద్రత విషయంలో ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు.

22 నిమిషాల్లో పాక్‌ పని పట్టిన ‘ఆపరేషన్ సింధూర్’

గత ఏడాది ఏప్రిల్‌లో.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేసి, శత్రు దేశాన్ని భారత్ మోకాళ్లపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. “ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని నేను పాకిస్థాన్‌కు చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మళ్లీ అలాంటి దారుణాలకు ఒడిగడితే.. మన సాయుధ దళాలు వారు జీవితంలో మర్చిపోలేని విధంగా తగిన బుద్ధి చెబుతాయి” అని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: ‘పాకిస్థాన్ భూభాగమంతా మా రేంజ్‌లోనే’: రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ భద్రత పట్ల భారత ప్రభుత్వ దృక్పథం పూర్తిగా మారిందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులు, పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌లు చేపట్టి.. పాక్‌కు బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. ఇలా దాయాది దేశం మనపై దాడి చేసిన ప్రతీసారి.. భారత్ ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. శత్రువులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత సరిహద్దులను పటిష్టం చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు.. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్థాన్‌పై సముద్రం నుంచి దాడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుందన్నారు. కానీ చివరి నిమిషంలో పాక్ కాళ్లబేరానికి వచ్చిందని గుర్తు చేశారు. “భారత నావికాదళం అత్యంత దూకుడుగా వ్యవహరించింది. సముత్రం నుంచి మన క్షిపణులు పాక్ వైపు గురిపెట్టిన తరుణంలో.. వారు దాడులు ఆపమని ప్రాధేయపడ్డారు” అని అడ్మిరల్ త్రిపాఠి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.