భయానక దృశ్యాలు.. రాజస్థాన్లో భారీ ఇసుక తుఫాన్ బీభత్సం





చురు, బికనీర్, భానీపురా తదితర ప్రాంతాల్లో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు వచ్చిన ఇసుక తుఫాన్..
రాజస్థాన్లోని పలు జిల్లాలను భారీ ఇసుక తుపాను ముంచెత్తింది. దట్టమైన ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా అంధకారంగా మారింది. ఇసుక తుపాను అనంతరం భారీ వర్షం కురిసింది. చురు జిల్లాపై అధికంగా ఈ తుఫాను ప్రభావం కనిపించగా, బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. సుమారు 30 నిమిషాల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ గాలులకు ఇసుక భారీగా కొట్టుకొచ్చి రోడ్లు, నివాస ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రహదారులపై కొన్ని అడుగుల మేర ఇసుక పేరుకుపోయింది.
ప్రజలు గాయపడినట్లు లేదా గణనీయమైన నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు ఏవీ అందుబాటులో లేవు. అయితే, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ దృశ్యమానత ఉన్న సమయాల్లో అనవసర ప్రయాణాలను నివారించాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాలలో వాతావరణ మార్పులు కొనసాగుతాయని, అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు, దుమ్ముతో కూడిన గాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) అంచనా వేసింది..