పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రతరం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.

పశ్చిమ ఆసియా పరిస్థితిపై ప్రభుత్వం నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, రాజీవ్ రంజన్ (లలన్) సింగ్, ఇతర నాయకులు హాజరయ్యారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులకు శ్రీ రిజిజు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలు, ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితికి ప్రతిస్పందనగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్ని ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతును హామీ ఇచ్చాయని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా హాజరయ్యారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఉద్రిక్తతల కారణంగా కీలకమైన సముద్ర మార్గాలకు అంతరాయం ఏర్పడటంతో పాటు గల్ఫ్ దేశాల్లోని భారత పౌరుల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.

పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా సంఘర్షణ ప్రభావాన్ని తగ్గించడానికి ఇంధనం, సరఫరా గొలుసులు, ఎరువులు, ఇతర రంగాలపై వ్యూహాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడు సాధికార బృందాలను ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి మోదీ తన ప్రకటనలో తెలిపారు..